Trending News

Chief Minister Mamata Banerjee: బతికుంటే విశ్వకవి ఠాగూర్‌కూ ఈసీ వేధింపులే ఎదురయ్యేవి! – మమతా ఫైర్

ఈసీ వేధింపులే ఎదురయ్యేవి! – మమతా ఫైర్

Update: 2026-01-23 08:40 GMT

Chief Minister Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన 'ప్రత్యేక ముమ్మర సవరణ' (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఒత్తిడి కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు కనీసం 110 మంది మరణించారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బతికి ఉంటే ఆయన పేరు, ఇంటిపేరు వివాదాలతో ఈసీ అధికారులు ఆయన్ను కూడా ఇబ్బంది పెట్టి ఉండేవారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

49వ అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శనను గురువారం ప్రారంభించిన సందర్భంగా మమతా మాట్లాడుతూ... ‘‘బెంగాల్‌లో ఏళ్ల తరబడి ఉపయోగంలో ఉన్న ఇంటిపేర్లలోనూ ఈసీ చిన్న చిన్న తేడాలు చూసి ప్రశ్నిస్తోంది. నన్ను కొందరు 'మమతా బెనర్జీ' అని, మరికొందరు 'మమతా బంధోపాధ్యాయ్' అని పిలుస్తారు. అలాగే 'ఛటర్జీ', 'ఛటోపాధ్యాయ' ఒకే ఇంటిపేరు వేరియేషన్లు. బ్రిటిష్ కాలంలో 'ఠాకుర్' అనే పేరును 'ఠాగూర్'గా మార్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇప్పుడు బతికి ఉంటే ఆయన పేరుతో కూడా ఈసీ ఇలాంటి ప్రశ్నలు వేసి వేధించి ఉండేది!’’ అని ఆమె ఎద్దేవా చేశారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్లను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని మమతా విమర్శించారు. ‘‘పిల్లల మధ్య వయసు వ్యవధిని ఎందుకు ఉందో వివరించమంటున్నారు. వయోవృద్ధులను పుట్టిన తేదీ రుజువులు తెచ్చుకోమంటున్నారు. గత తరాల్లో చాలామందికి సరైన బర్త్ సర్టిఫికెట్లు లేవు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కూడా తన అసలు పుట్టిన తేదీ డిసెంబర్ 25 కాదని నాతో చెప్పారు. ఇలాంటి కారణాలతో ప్రజలను ఎందుకు వేధిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.

ఎస్‌ఐఆర్ వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, మరణాలపై 26 కవితలతో కూడిన పుస్తకాన్ని ప్రచురించి, ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నట్లు మమతా తెలిపారు. అలాగే, ఆరుసార్లు ఎంపీగా పనిచేసినందుకు వచ్చే రూ.1.50 లక్షల పెన్షన్ లేదా ముఖ్యమంత్రి వేతనం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదని, తన పుస్తకాల రాయల్టీతోనే ఖర్చులు నడుపుకుంటున్నానని ఆమె వెల్లడించారు.

Tags:    

Similar News