PM Modi: చైనా సరిహద్దుకు సమీపంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యం.. హైవేపై చారిత్రక ల్యాండింగ్‌తో ప్రధాని మోదీ
హైవేపై చారిత్రక ల్యాండింగ్‌తో ప్రధాని మోదీ
PM Modi: ఈశాన్య భారతదేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF) ఆవిష్కృతమైంది. ఈ సౌకర్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న C-130J విమానం చారిత్రకంగా ల్యాండ్ అయింది. ఈ ఘట్టం దేశ రక్షణ వ్యవస్థకు కీలకమైన మైలురాయిగా నిలిచింది.
ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యం చైనా సరిహద్దుకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిబ్రూగఢ్ జిల్లాలోని మోరాన్ బైపాస్‌లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది జాతీయ రహదారిపై నిర్మించిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్‌గా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా భారత వాయుసేన ప్రత్యేక వైమానిక విన్యాసాలను ప్రదర్శించింది. ప్రధాని మోదీ ఈ సౌకర్యాన్ని ప్రారంభించి దేశానికి అంకితం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో దిబ్రూగఢ్ విమానాశ్రయం లేదా చబువా వాయు సేనా స్టేషన్‌లు పనిచేయలేని సమయంలో ఈ ఎల్‌ఎఫ్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వాయుసేన వేగంగా స్పందించేందుకు ఈ సౌకర్యం దోహదపడుతుంది. టేకాఫ్, ల్యాండింగ్‌లకు అనువుగా రూపొందించిన ఈ ఫెసిలిటీ యుద్ధ సమయంలో సైనిక కార్యకలాపాలు, మానవతా సహాయ కార్యక్రమాలు, అత్యవసర ప్రతిస్పందనలకు కీలక పాత్ర పోషిస్తుంది.
పశ్చిమ, ఉత్తర, మధ్య భారతదేశంలో ఇప్పటికే ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ సౌకర్యాలు ఉన్నాయి. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈశాన్య ప్రాంతంలో ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సౌకర్యం దేశ రక్షణ వ్యూహంలో భాగంగా ఈశాన్య సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ.. క్లిష్ట సమయాల్లో సహాయ కార్యకలాపాలు, అత్యవసర ప్రతిస్పందనలకు ఈ సౌకర్యం కీలకమని పేర్కొన్నారు. ఈ చారిత్రక ఘటన దేశ రక్షణ శక్తులకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కొత్త దిశను అందిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.