Former Kenya Prime Minister Raila Odinga: కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా కేరళలో కన్నుమూత
రైలా ఒడింగా కేరళలో కన్నుమూత
Former Kenya Prime Minister Raila Odinga: కెన్యా దేశ మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా (80) భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో కన్నుమూశారు. అక్టోబర్ 15, 2025 ఉదయం ఆయుర్వేద కంటి ఆస్పత్రి ఆవరణలో గుండెపోటుతో ఆయన మరణించారు. కంటి చూపు సమస్య కోసం చికిత్స కోసం ఆయన కేరళకు వచ్చారు.
రైలా ఒడింగా 2008 నుంచి 2013 వరకు కెన్యా ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన కెన్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. 25 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా, లంగాటా నియోజకవర్గ ఎంపీగా సేవలందించారు. కొంతకాలంగా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ఆయన, చికిత్స కోసం ఐదు రోజుల క్రితం కేరళలోని కూతట్టుకుళంలో ఉన్న ఆయుర్వేద కంటి ఆస్పత్రికి వచ్చారు.
అక్టోబర్ 15 ఉదయం ఆస్పత్రి ఆవరణలో ఉదయం నడక సమయంలో ఆయనకు కార్డియాక్ అరెస్ట్ సంభవించింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది చికిత్స ప్రారంభించినప్పటికీ, ఉదయం 9 గంటల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన వెంట కుమార్తె రోజ్మేరీ మరియు వ్యక్తిగత వైద్యుడు ఉన్నారు. కేరళ ప్రభుత్వం ఈ విషయాన్ని ఢిల్లీలోని కెన్యా రాయబార కార్యాలయానికి తెలియజేసింది.
కేరళతో ప్రత్యేక అనుబంధం
రైలా ఒడింగా కుటుంబానికి కేరళలోని ఆయుర్వేద ఆస్పత్రితో దీర్ఘకాల అనుబంధం ఉంది. ఆయన కుమార్తె రోజ్మేరీ 2017లో కంటి చూపు సమస్యతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొంది, 2019 నాటికి పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి కంటి సమస్యలకు ఈ కుటుంబం కేరళలోని ఈ ఆస్పత్రిని ఆశ్రయిస్తోంది. ఇటీవల ఒడింగా కంటి చూపు మందగించడంతో, కుమార్తె సహాయంతో ఈ ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఊహించని విధంగా గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.