Former Vice President Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ బుధవారం ఉదయం నడక సమయంలో అపస్మారక స్థితికి వెళ్లి కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని ఏమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. 75 ఏళ్ల ధన్‌ఖర్‌ను ఆసుపత్రి కార్డియో-న్యూరో సెంటర్‌లో చేర్చి, కార్డియాలజీ విభాగం డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు, చికిత్స అందిస్తున్నారు.


ఆయనతో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పీసీఆర్ వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని నిమిషాలు అపస్మారకంగా ఉన్న ధన్‌ఖర్‌కు ఐఎల్‌బీఎస్ వైద్య బృందం, ఏమ్స్ డాక్టర్ సందీప్ సేథ్ ప్రాథమిక చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అంబులెన్స్‌లో ఏమ్స్‌కు తరలించారు. ఆరోగ్య వివరాలు వెంటనే అందుబాటులో లేవు. ఏమ్స్ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


ధన్‌ఖర్ 2022 ఆగస్టు నుంచి 2025 జులై 21 వరకు భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. గత రెండేళ్లుగా ఆయనకు అనేకసార్లు స్పృహ తప్పే సమస్య ఎదురైంది. 2025 మార్చిలో ఛాతీ నొప్పితో ఏమ్స్‌లో చేర్చి ఆంజియోప్లాస్టీ చేశారు. 2025 జూన్‌లో నైనిటాల్‌లో కుమావోన్ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ కార్యక్రమంలో స్పృహ తప్పారు. జనవరిలో ఇంట్లో రెండుసార్లు అపస్మారక స్థితి ఏర్పడింది.


ఉపరాష్ట్రపతి భవన్ ఖాళీ చేసిన తర్వాత ఆయన హర్యానా రాజకీయ నాయకుడు అభయ్ చౌతాలా సౌత్ ఢిల్లీ ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత అధికారిక నివాసం కేటాయించలేదు.

Tags: