National Highways Minister Nitin Gadkari: త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సులు.. ఉల్లంఘనలకు పాయింట్లు, తగ్గితే సస్పెన్షన్ లేదా రద్దు - మంత్రి నితిన్ గడ్కరీ
తగ్గితే సస్పెన్షన్ లేదా రద్దు - మంత్రి నితిన్ గడ్కరీ
National Highways Minister Nitin Gadkari: రోడ్లపై బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను అమలు చేయనుంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాయింట్లు తగ్గించే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
"మేం గ్రేడ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్సుల వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నాం. ఈ విధానంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు కొన్ని పాయింట్లు తగ్గుతాయి. అలా మొత్తం పాయింట్లు తగ్గిపోతే డ్రైవింగ్ లైసెన్సును 6 నెలల పాటు సస్పెండ్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ విధానాన్ని ప్రారంభిస్తాం" అని గడ్కరీ వివరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి వల్ల 1.8 లక్షల మంది మరణిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 18-45 ఏళ్ల వారిలో 72 శాతం మరణాలు జరుగుతున్నాయని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల 54,122 మంది మరణిస్తున్నారని, 18 ఏళ్ల లోపు వారిలో 10,119 మంది ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరచడం, డ్రైవర్లలో బాధ్యతా భావాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే ఈ గ్రేడ్ పాయింట్ల విధానం అమలులోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు.