Omar Abdullah: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా (ఆర్టికల్ 370) మరియు రాష్ట్ర హోదాను కేంద్రం రద్దు చేయకపోయి ఉంటే.. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు తమను తిరిగి జమ్మూకశ్మీర్‌లో విలీనం చేయాలని కోరుతూ తిరుగుబాటు చేసేవారని ఆయన అన్నారు.

పీవోకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ప్రజల పరిస్థితి తనను బాధిస్తోందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అక్కడ పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘‘1947లో పాకిస్థానీ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా కశ్మీర్ ప్రజలు పోరాడారు. భారత సైన్యం చేరుకోవడానికి ముందే స్థానికులు తమ ప్రాంతాన్ని రక్షించుకున్నారు. నా తాత, జమ్మూకశ్మీర్ తొలి ప్రధానమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లా నేతృత్వంలోనే ఆ పోరాటం జరిగింది. ఇప్పుడు సరిహద్దుల్లో పరిస్థితులను చూస్తే మన పూర్వీకులు చెప్పిన మాట నిజమని అర్థమవుతోంది’’ అని ఆయన గుర్తుచేశారు.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీవోకేకు సంబంధించిన సీట్లను ఖాళీగా ఉంచామని, ఏదో ఒక రోజు అవి నిండుతాయన్న ఆశతో ఉన్నామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. రాష్ట్ర హోదా, ఇతర రాజ్యాంగపరమైన హామీలను పునరుద్ధరించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని, జమ్మూకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను జమ్మూకశ్మీర్ బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ తీవ్రంగా విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పర్వదినాన్ని రాజకీయాలకు వాడుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలు మాట్లాడాల్సిన వేదికను రాజకీయాలకు మార్చేశారు’’ అని ఆయన దుయ్యబట్టారు.

Tags: