Rahul Gandhi: అమెరికా ఆదేశాలకు భారత్ తలవంచింది: రాహుల్ గాంధీ విమర్శ
రాహుల్ గాంధీ విమర్శ
వాణిజ్య ఒప్పందం అమెరికాకు మాత్రమే లాభదాయకం
బడ్జెట్ చర్చలో రాహుల్ ప్రసంగంపై హోరాహోరీ
Rahul Gandhi: భారత ప్రభుత్వం అమెరికా ముందు తలవంచి మోకరిల్లిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం పూర్తిగా అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉందే తప్ప, భారత్‌కు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందంతో పాటు కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రపంచంలో జరుగుతున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిఫలనాలు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
‘ప్రపంచమంతా కృత్రిమ మేధ (ఏఐ) యుగంలోకి అడుగుపెడుతోంది. దీని ప్రభావంతో భారత్‌లోని ఐటీ సంస్థలు భారీ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయి. మన దేశానికి యువతరం యొక్క ప్రతిభే అతిపెద్ద సంపద. ఏఐకి డేటానే ప్రధాన ఇంధనం.. డేటా లేకుండా ఏఐ ఏమీ సాధించలేదు. అమెరికా తన సూపర్ పవర్ స్థానాన్ని కాపాడుకోవాలంటే, భారత్ డేటా కీలకమవుతుంది. గతంలో జనాభాను సమస్యగా చూసేవారు, కానీ ఇప్పుడు అది మనకు గొప్ప ఆస్తి. అయితే, మన డేటాను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బదులుగా అమెరికా కంపెనీలకు ట్యాక్స్ హాలిడేలు ప్రకటించింది’ అని రాహుల్ గాంధీ అన్నారు.
వాణిజ్య ఒప్పందం అమెరికాకు మాత్రమే లాభదాయకం
‘మన దేశం ఏ దేశాల నుంచి చమురు కొనాలో కూడా అమెరికా నిర్దేశిస్తోంది. వారు చెప్పినట్లు చేయకపోతే, 50 శాతం టారిఫ్‌లు విధిస్తామని బెదిరిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగి, మన కీలక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ను తెరిచేశారు. గతంలో మన ఉత్పత్తులపై కేవలం 3 శాతం పన్ను మాత్రమే ఉండేది, ఇప్పుడు అది 18 శాతానికి పెరిగింది. అమెరికా నుంచి దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఒప్పందం భారత్‌కు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. డాలర్ విలువను కాపాడుకునేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది’ అని రాహుల్ గాంధీ వివరించారు.
బడ్జెట్ చర్చలో రాహుల్ ప్రసంగంపై హోరాహోరీ
బడ్జెట్ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను ప్రస్తావిస్తూ మాట్లాడటంపై స్పీకర్ జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరీ పేర్లను ప్రస్తావించడంపై బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయినప్పటికీ రాహుల్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, అధికార పక్ష సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. అమెరికా ముందు తలవంచి డేటా, వ్యవసాయం, ఇంధన రంగాలను అమ్మకానికి పెట్టారంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు.