Leander Paes: భాజపాలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

Update: 2026-03-31 09:54 GMT

Leander Paes: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టెన్నిస్ ఐకాన్ లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అధికారికంగా చేరారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా పేస్ సాధించిన విజయాలను రిజిజు ప్రత్యేకంగా గుర్తు చేశారు.

1996 అట్లాంటా ఒలింపిక్ క్రీడల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి, 22 ఏళ్ల వయసులోనే భారత్ పేరు ఒలింపిక్ మెడల్ జాబితాలో చేర్చిన ఘనత లియాండర్ పేస్‌ది. రిజిజు మాట్లాడుతూ, ‘‘ఒలింపిక్ మెడల్స్ జాబితాలో భారత్‌ను చేర్చిన లియాండర్ పేస్ ఇకపై భాజపా వేదికగా దేశ సేవ చేయనున్నారు’’ అని పేర్కొన్నారు.

కోల్‌కతాలో జన్మించిన పేస్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్ వైపు మొగ్గు చూపారు. తన కెరీర్‌లో ఏకంగా 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచారు. వీటిలో 8 పురుషుల డబుల్స్, 10 మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. రాకెట్ వదిలేసి 2021లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరి, ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లియాండర్ పేస్ బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News