Lok Sabha Speaker Om Birla: స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం విఫలం

అవిశ్వాస తీర్మానం విఫలం

Update: 2026-03-12 12:05 GMT

మూజువాణి ఓటుతో తిరస్కరణ - రెండు రోజులు ఉద్వేగభరిత చర్చ

Lok Sabha Speaker Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. రెండు రోజుల పాటు జరిగిన తీవ్ర చర్చ అనంతరం బుధవారం సాయంత్రం నిర్వహించిన ఓటింగ్‌లో సభ దీనిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.

విపక్షాలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వారి గొంతును అణచివేస్తున్నారని ఆరోపిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. మంగళవారం చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు మాట్లాడుతూ, ఏ ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తినా స్పీకర్ నోటి నుంచి ‘నో.. నో.. నో’ అనే మాటలు వస్తాయని విమర్శించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోదీ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో రాజీపడ్డారని, లద్దాఖ్ సంక్షోభంపై మాజీ సైన్య అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకంపై చర్చ జరగకుండా చేశారని ఆరోపించారు. అదానీ, ఎప్‌స్టీన్ ఫైల్స్ వంటి అంశాలను లేవనెత్తినప్పుడు తన గొంతు నొక్కేశారని చెప్పారు. ఒకే రోజు 140 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారని, స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వివిధ పార్టీల సభ్యులు ఆరోపించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానంగా మాట్లాడుతూ, సభాపతి చిత్తశుద్ధిని శంకించడం దురదృష్టకరమని, నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తెచ్చడం అసాధారణమని అన్నారు. సభ తన సొంత నియమాలపై నడుస్తుందని, ఏ పార్టీ నిబంధనలపై కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కీలక చర్చల సమయంలో విదేశాలకు వెళ్తుంటారని, 17వ లోక్‌సభలో ఆయన హాజరు 51 శాతమే అని, కాంగ్రెస్‌కు భాజపా కంటే ఆరు రెట్లు ఎక్కువ సమయం ఇచ్చారని గణాంకాలతో వివరించారు.

చర్చ మధ్యలో విపక్ష సభ్యులు వెల్ వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ అంతరాయం కలిగించారు. కొన్ని కించపరిచే వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఓటింగ్‌లో తీర్మానం విఫలమైంది. ఈ ఘటన పార్లమెంటరీ సంప్రదాయాలపై చర్చను రేకెత్తించింది.

Tags:    

Similar News