Rahul Gandhi Slams: మోదీజీ.. సిగ్గుపడాల్సింది మీరే.. ఎప్‌స్టీన్‌ ఫైళ్లు, దేశ డేటా అమ్మకం.. రాహుల్ తీవ్ర విమర్శలు

ఎప్‌స్టీన్‌ ఫైళ్లు, దేశ డేటా అమ్మకం.. రాహుల్ తీవ్ర విమర్శలు

Update: 2026-02-24 06:57 GMT

Rahul Gandhi Slams: ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై 'సిగ్గుచేటు రాజకీయాలు' చేస్తోందంటూ ఆదివారం విమర్శలు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. వాస్తవంగా సిగ్గుపడాల్సింది ప్రధాని మోదీయే అని, ఆయన మంత్రివర్గ సహచరుడు, స్నేహితుల పేర్లు ఎప్‌స్టీన్ ఫైళ్లలో కనిపించడమే అతిపెద్ద సిగ్గుచేటని ఎక్స్‌లో పోస్టు చేసి మండిపడ్డారు.

''మోదీజీ.. మీరు సిగ్గు గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుచేటు అంటే ఏమిటో నన్ను చెప్పనివ్వండి. మీ పేరు, మీ మంత్రి పేరు, మీ స్నేహితుడి పేరు మూకుమ్మడిగా ఎప్‌స్టీన్ ఫైళ్లలో కనిపించడం సిగ్గుపడాల్సిన విషయం. దేశాన్ని అమ్మేస్తూ అమెరికాతో మీరు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. సిగ్గుచేటు అంటే అది. మీరు దేశ డేటాను ఇతరులకు అప్పగించేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారు. జౌళి పరిశ్రమను నాశనం చేశారు. ఇవన్నీ సిగ్గుపడాల్సిన విషయాలు'' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు ఉండటంతో మోదీకి రాత్రుళ్లు నిద్రపట్టడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ''మీ స్నేహితులైన అనిల్ అంబానీ, అదానీల కోసం మీరు ఏమైనా చేసుకోండి. నాతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు దేశాన్ని రక్షించుకోవడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు'' అని రాహుల్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఎదురుతిరిగి ముస్లిం దుకాణదారుడికి అండగా నిలిచిన వ్యాయామశాల యజమాని దీపక్ కుమార్‌ను రాహుల్ గాంధీ దిల్లీలో కలిశారు. దీపక్ ధైర్యాన్ని మెచ్చుకున్న రాహుల్ ఆయన భార్యతో ఫోన్‌లో మాట్లాడారు. కోట్‌ద్వార్‌కు వచ్చి ఆయన వ్యాయామశాలలో సభ్యత్వం తీసుకుంటానని హామీ ఇచ్చారు. సోనియా గాంధీతో కూడా దీపక్ సమావేశమయ్యారు. ఈ ఘటన తర్వాత దీపక్ 'మహమ్మద్ దీపక్'గా ప్రాచుర్యం పొందారు.

Tags:    

Similar News