Naravane’s Memoirs: నరవణె జ్ఞాపకాలు: అంతర్జాతీయ మార్కెట్లలోకి పుస్తకం..లీక్ వెనుక పక్కా కుట్ర!
లీక్ వెనుక పక్కా కుట్ర!
Naravane’s Memoirs: భారత సైనిక దళాల మాజీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే ఆత్మకథాత్మక పుస్తకం గురించి కొత్త వివరాలు బయటపడ్డాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక అనుమతులు రాకముందే ఈ పుస్తకం అంతర్జాతీయ మార్కెట్లలోకి చేరినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇదంతా ఒక సునిశితమైన ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు వారు అనుమానిస్తున్నారు.
ఈ పుస్తకం లీక్ అయిన కాపీలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లోని ఆన్‌లైన్ విక్రయ వేదికల్లో అందుబాటులో ఉన్నాయని దర్యాప్తు బృందం కనుగొంది. ఆశ్చర్యకరంగా, ఈ లీక్ అయిన వెర్షన్‌కు అంతర్జాతీయ స్టాండర్డ్ బుక్ నంబర్ (ఐఎస్‌బీఎన్) కూడా ఉండటం గమనార్హం. సాధారణంగా అన్ని అనుమతులు పొందిన తర్వాతే పుస్తకాలకు ఈ 13 అంకెల నంబర్‌ను కేటాయిస్తారు. రక్షణ శాఖ అనుమతి లేకుండానే ఈ నంబర్ ఉండటం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.
‘‘ఇది సాధారణ పైరసీ కాదు. పుస్తకాన్ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఒక సమన్వితమైన కుట్ర జరిగినట్లు మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది’’ అని ఢిల్లీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రచురణ సంస్థ పెంగ్విన్ ఇండియాను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, విదేశీ మార్కెట్లకు పుస్తకాన్ని పంపిన డిజిటల్, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తున్నామని వెల్లడించారు. అయితే, ఈ తాజా పరిణామాలపై రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి స్పందనా ఇవ్వలేదు.
చైనా సైనిక దళాలతో భారత బలగాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ఈ పుస్తకంలో నరవణె ప్రస్తావించారు. రక్షణ శాఖ నుంచి ప్రచురణ అనుమతి రాకపోవడంతో ఈ లీక్ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని లోక్‌సభలో ప్రస్తావించడంతో ఈ విషయం బహిర్గతమైంది. ఇప్పటికే దీనిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పెంగ్విన్ ఇండియాకు నోటీసులు పంపారు.