Narendra Modi: మా ఎజెండా ఇంకా పూర్తి కాలేదు.. జమిలి ఎన్నికలు, యూసీసీ తప్పక అమలు చేస్తాం: ప్రధాని మోదీ

జమిలి ఎన్నికలు, యూసీసీ తప్పక అమలు చేస్తాం: ప్రధాని మోదీ

Update: 2026-04-07 14:59 GMT

Narendra Modi: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అనే రెండు ముఖ్యమైన అంశాలు భాజపా ఎజెండాలో ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ రెండింటిపై కూడా సానుకూలంగా ముందడుగులు పడుతున్నాయని, తమ మిషన్‌ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

భాజపా 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ.. ‘‘మహిళా రిజర్వేషన్ల కోసం 1994లో మొదటిసారి భాజపాయే ప్రస్తావించింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి మద్దతు ఇస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి దీన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని తెలిపారు.

కాంగ్రెస్‌ హయాంలో భాజపా కార్యకర్తలు ఎమర్జెన్సీ సమయంలోనూ, ఆ తర్వాత అనేక రకాల అణచివేతలను ఎదుర్కొన్నారని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. పశ్చిమబెంగాల్‌, కేరళల్లో ఇప్పటికీ హింస రాజకీయ సంస్కృతిగా మారిన విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.

వసుధైవ కుటుంబకం.. యుద్ధ సమయంలోనూ అదే వర్తిస్తుంది

భాజపా ‘వసుధైవ కుటుంబకం’ను విశ్వసిస్తుందని, యుద్ధ సమయంలో కూడా అదే వర్తిస్తుందని ప్రధాని చెప్పారు. అన్ని దేశాలతో సమదూర విధానాన్ని కొన్నాళ్లు అనుసరించినా, ఇప్పుడు ప్రతి దేశంతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకుంటున్నామని వివరించారు.

పాతికేళ్లుగా కొనసాగుతున్న ఎన్డీయే కూటమి ఒక్కటే ప్రజల కోసం, దేశ ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంకీర్ణమని మోదీ ప్రశంసించారు. తొలుత ‘ఎక్స్‌’ వేదికగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

అస్సాం ఎన్నికల సభలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శ

అస్సాంలోని బార్పేట్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మరోసారి కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘‘పొరుగున ఉన్న ఉగ్రవాద తండాలపై మేము ‘ఆపరేషన్ సిందూర్‌’ చేపడితే.. కాంగ్రెస్‌ మాత్రం ఇప్పటికీ పాకిస్థాన్‌కు వంతపాడుతోంది. చొరబాటుదారులకు మద్దతు ఇస్తోంది. భూఆక్రమణలకు వ్యతిరేక చర్యలను అడ్డుకుంటోంది’’ అని ఆరోపించారు.

రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ అధికారం మీదే కాంగ్రెస్‌ దృష్టి సారించిందని, దీంతో అస్సాం సంప్రదాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మోదీ విమర్శించారు. దిబ్రూగఢ్‌ సభలో కూడా ఆయన ఇదే విషయాలను ప్రస్తావించారు.

భాజపా కార్యకర్తలు ఇంకా ఉత్సాహంగా పని చేయాలని, దేశాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News