Narendra Modi Slams: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కాంగ్రెస్ రాజకీయం: ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు

Update: 2026-03-11 11:36 GMT

Narendra Modi Slams: పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ఆ ప్రాంతంలోని ప్రవాస భారతీయుల పరిస్థితిని మరింత దిగజార్చేలా రెచ్చగొట్టే, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ పర్యటనలో భాగంగా బుధవారం ఎర్నాకుళంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

“గల్ఫ్ ప్రాంతంలోని పరిస్థితుల కారణంగా మనం ఆందోళన చెందడం సహజమే. అక్కడ లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు దేశంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తుంచుకోవాలి. మన పౌరులు విదేశాల్లో చిక్కుకున్నప్పుడల్లా వారి క్షేమం కోసం అన్ని వనరులను ఉపయోగించి సహాయం అందిస్తాం. ఎప్పుడూ వారిని ఒంటరిగా వదలం. ప్రస్తుత సంక్షోభంలో కూడా అవసరమైన సహాయం అందేలా చూస్తున్నాం. గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. మన మిత్రదేశాలు భారతీయులను జాగ్రత్తగా చూసుకుంటున్నాయి” అని మోదీ వివరించారు.

“ఈ సంక్షోభ సమయంలో కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం దురదృష్టకరం. ఆందోళనలు రేకెత్తించేలా హస్తం పార్టీ ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు చేస్తోంది. ఈ ప్రచారం కోసం వారు రీల్స్ కూడా చేస్తారేమో!” అని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడం, మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయడంలో పెట్రోలియం రంగం విస్తరణ కీలకమని మోదీ అన్నారు. ఆ దిశగా కొచ్చి రిఫైనరీ వద్ద పాలీప్రొపిలీన్ యూనిట్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. గల్ఫ్ యుద్ధం స్వావలంబన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసిందని నొక్కి చెప్పారు.

Tags:    

Similar News