Narendra Modi Slams: కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అవినీతి దోపిడీకి మోదీ తీవ్ర విమర్శ
మోదీ తీవ్ర విమర్శ
Narendra Modi Slams: వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ లు కేరళను దశాబ్దాలుగా దోచుకుంటూ వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఆరోపించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏ ఒక్కరికో ‘బీ టీం’ కాదని, నిజమైన ‘ఏ టీం’ అని స్పష్టం చేశారు. ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసి, అవినీతిపరులు దోచుకున్న డబ్బును వసూలు చేసి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.
పాలక్కాడ్‌లో ఆదివారం భారీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, కేరళ కొన్ని దశాబ్దాలుగా స్వార్థపర రాజకీయాలతో నలిగిపోతోందని విమర్శించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లు కుంభకోణాల మధ్య అధికారాన్ని మార్చుకుంటూ జేబులు నింపుకుంటున్నాయని, ఒకరిపై ఒకరు ఎన్నడూ చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
కేరళ ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారని, ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మోదీ తెలిపారు. ఎన్డీయే కేరళను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతుందని, ‘మోదీ హామీల గ్యారంటీ’తో రాష్ట్రం ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కేరళ రూ.5 లక్షల కోట్లకు పైగా రుణభారంతో సతమతమవుతోందని, ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు, ప్రజల కఠోర శ్రమ ఎక్కడికి పోతున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. దీనికి సమాధానం ఒక్కటే... అది ఎల్డీఎఫ్ (సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం) జేబుల్లోకి వెళ్తోందని మోదీ విమర్శించారు.
కాంగ్రెస్, వామపక్షాల ట్రాక్ రికార్డు
కాంగ్రెస్, వామపక్షాలు ఎక్కడ అధికారంలోకి వచ్చినా నాశనం చేస్తాయనే ట్రాక్ రికార్డు ఉందని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్, త్రిపురలలో కమ్యూనిస్టులు ఏం చేశారో దేశం మొత్తం చూసిందని, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఏం చేసిందో అందరూ తెలుసుకున్నారని గుర్తు చేశారు. అదే దుర్మార్గపు పథకాలతో కేరళను కూడా నాశనం చేశాయని విమర్శించారు.
జాతీయ స్థాయిలో ఈ రెండు కూటములు కలిసి పని చేస్తాయని, రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థులుగా నటిస్తాయని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట కూడా పరిస్థితి దారుణంగానే ఉందని తెలిపారు.
ఈ సభలో ప్రధాని మోదీ ఉత్సాహంగా ప్రసంగించారు. కేరళలో ఎన్డీయే విజయం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు.