Prime Minister Narendra Modi: ప్రధాని మోదీ: నితిన్ నబీన్ నా బాస్.. పార్టీ విషయాల్లో నేను సాధారణ కార్యకర్తనే

పార్టీ విషయాల్లో నేను సాధారణ కార్యకర్తనే

Update: 2026-01-21 08:16 GMT

Prime Minister Narendra Modi: భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబీన్ (45) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పార్టీ విషయాల్లో తాను కేవలం ఒక సాధారణ కార్యకర్త మాత్రమేనని, నితిన్ నబీన్ తనకు బాస్ అని పేర్కొన్నారు. 'పార్టీలో నా పనితీరు నివేదికను కొత్త అధ్యక్షునికి అందజేస్తున్నా. ఇక నా పనితీరుపై రహస్య నివేదికను ఆయనే రాస్తారు. ఆయన మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్నా. భాజపాతో పాటు ఎన్డీయే కూటమి పక్షాల సమన్వయ బాధ్యత కూడా ఆయనదే' అని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్రువపత్రాన్ని అందజేశారు. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను ఆయన ప్రకటించారు. తర్వాత మోదీ, కేంద్ర మంత్రులు నితిన్‌ను అభినందించి, ఛాంబర్‌కు తీసుకెళ్లారు. కార్యక్రమంలో భాజపా మాజీ అధ్యక్షులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీఎల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మోదీ తన ప్రసంగంలో భాజపా చరిత్రను గుర్తుచేస్తూ, 'పార్టీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కావచ్చు. నిర్ణయాలు, ఎంపికలు అన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. వాజ్‌పేయీ, ఆడ్వాణీ, వెంకయ్యనాయుడు, మురళీమనోహర్ జోషి వంటి నాయకుల నేతృత్వంలో మనం సున్నా నుంచి శిఖరాగ్రానికి చేరుకున్నాం. వెంకయ్యనాయుడు, గడ్కరీలు పార్టీని విస్తరించారు. రాజ్‌నాథ్ సింగ్ హయాంలో కేంద్రంలో మొదటిసారి సొంత మెజార్టీ సాధించాం. అమిత్ షా నేతృత్వంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, రెండోసారి కేంద్ర అధికారంలోకి వచ్చాం. నడ్డా హయాంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బలోపేతమయ్యాం' అని వివరించారు.

భాజపా గ్రామస్థాయి నుంచి పటిష్ఠంగా ఉందని, తాను భాజపా కార్యకర్తగా గర్వపడుతున్నానని మోదీ చెప్పారు. 'ప్రతి కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలి. భాజపా చేతిలోనే దేశం సురక్షితమని ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలంగాణ, బెంగాల్‌లో మనం బలపడుతున్నాం. కేరళలో కూడా గెలుపు అవకాశాలున్నాయి' అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన మోదీ, 'కాంగ్రెస్ చేస్తున్న తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. 1984లో 400కు పైగా లోక్‌సభ సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 100 మార్కును దాటడానికి తంటాలు పడుతోంది. ఓటములపై సమీక్ష చేసుకునే ధైర్యం ఆ పార్టీకి లేదు. సమీక్ష చేస్తే పార్టీ ఎవరి చేతుల్లో ఉందో ప్రశ్నలు వస్తాయనే భయం. మనం మాత్రం విజయాల తర్వాత కూడా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై సమీక్షిస్తాం. భాజపా అంటే ఒక సంప్రదాయం, ఒక కుటుంబం. సభ్యత్వాల కంటే సంబంధాలకు మనం ప్రాధాన్యం ఇస్తాం. పని చేయడం మన జీవితకాల బాధ్యత' అని అన్నారు.

నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ, యువత రాజకీయాలకు దూరంగా ఉండటం సరికాదని, ఈ రంగంలోకి వచ్చి క్రియాశీలంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 'ప్రతి కార్యకర్త చేసే ప్రయత్నాన్ని పార్టీ గుర్తిస్తుంది. భారతీయ సంప్రదాయాలకు ఆటంకం కలిగించే పార్టీలను ఓడించాలి' అని ఆయన అన్నారు.

Tags:    

Similar News