Prime Minister Narendra Modi: ప్రధాని మోదీ బెంగాల్ ఓటర్లకు బహిరంగ లేఖ: "బెంగాల్‌ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది"

"బెంగాల్‌ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది"

Update: 2026-02-24 06:53 GMT

Prime Minister Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన కింద రాష్ట్రం దయనీయ స్థితికి చేరుకుందని, దీనిని చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తక్షణమే రాజకీయ మార్పు అవసరమని, బెంగాల్‌ను మళ్లీ 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్)గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోయినా, కేంద్రం అనేక కీలక పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తోందని మోదీ పేర్కొన్నారు. 'జన్ ధన్ యోజన' కింద దాదాపు 5 కోట్ల మంది ఖాతాలు తెరిపించామని, 'స్వచ్ఛ భారత్ అభియాన్'లో 85 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని వివరించారు. 'అటల్ పెన్షన్ యోజన' ద్వారా 56 లక్షల వృద్ధులకు సహాయం అందించామని, 'ఉజ్వల యోజన'తో కోటి కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చామని, 'కిసాన్ సమ్మాన్ నిధి' ద్వారా 52 లక్షల రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు.

టీఎంసీ ప్రభుత్వం పేదల జీవనోపాధిని లాక్కుంటోందని మోదీ ఆరోపించారు. బెంగాల్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించేదని, కానీ నేడు దీనావస్థలో ఉందని విమర్శించారు. గత 6 దశాబ్దాల బుజ్జగింపు రాజకీయాల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని అన్నారు. ఒకవైపు ఉపాధి లేక యువత వలసలు పోతున్నారు, మరోవైపు మహిళలు భద్రత లేక భయపడుతున్నారని పేర్కొన్నారు. స్వామి వివేకానంద, రిషి అరబిందోలు కలలు కన్న బెంగాల్ నేడు ఓటు బ్యాంకు రాజకీయాలు, హింస, అరాచకత్వంతో నిండిపోయిందని ఆయన బాధ వ్యక్తం చేశారు.

బెంగాల్‌ను పునర్నిర్మాణం చేద్దామని, 2026 నాటికి రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్‌గా మారుస్తామని ప్రమాణం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఓటర్లు ఆలోచనాపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలని, రాష్ట్ర భవిష్యత్తును తమ చేతుల్లోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News