PM Narendra Modi: యుద్ధం వేళ ప్రజల్లో భయాందోళనలు రేపుతున్న కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
PM Narendra Modi: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశంలో భయాందోళనలు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఆరోపించారు. శనివారం అస్సాం రాష్ట్రంలోని సిల్చార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
“యుద్ధం వల్ల మన ప్రజలపై ఎలాంటి ప్రభావం పడకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరిస్తుందని ఆశించాం. కానీ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించి, దేశంలో భయాలు పుట్టించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇలా భయాందోళనలు రేపి నన్ను వేధించాలని చూస్తోంది” అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ఆయన ఆరోపించారు. అస్సాం ప్రజలు కాంగ్రెస్‌ను ఇప్పటికే తరిమికొట్టారని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రతి రాష్ట్రం ఆ పార్టీకి గుణపాఠం చెప్పనుందని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసన తెలపడాన్ని ప్రస్తావించి, దేశమంతా ఆ చర్యను ఖండించిందని మోదీ తెలిపారు. ఓటమి నిరాశతో కాంగ్రెస్ దేశంపైనే దాడికి దిగిందని, దుస్తులు చింపుకోవడం తప్ప వాళ్లకు మరేమీ మిగల్లేదని ఎద్దేవా చేశారు.
ఈ సభలో మోదీ అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలను తీవ్రంగా ఎండగట్టారు. దేశ భద్రత, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.