Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన జన్‌సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బిహార్‌లోని బాంకీపుర్ అసెంబ్లీ స్థానం నుంచి అనూహ్య విజయం సాధించి భాజపాకు భారీ షాక్ ఇచ్చారు. కమలం పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో ఆయన భాజపా అభ్యర్థి నీరజ్ కుమార్‌పై 18,964 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యం నెలకొల్పిన ప్రశాంత్ కిశోర్ విజయం బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన నితిన్ నబీన్ భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై, రాజ్యసభకు నామినేట్ కావడంతో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో జూలై 30న ఉపఎన్నిక జరిగింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక భాజపా కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ విజయబావుటా ఎగురవేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు అడ్డాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్ల తర్వాత భాజపా ఓటమి పాలవ్వడం గమనార్హం.

గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 243 స్థానాలకు గాను 238 చోట్ల పోటీ చేసినా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయినందుకు ప్రశాంత్ కిశోర్ బాధ్యత తీసుకుని మౌనవ్రతం చేశారు. బాంకీపుర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చగానే ఆయనే స్వయంగా బరిలోకి దిగారు. భాజపా అభ్యర్థికి అంతగా ప్రజాదరణ లేకపోవడం, ఓటర్లలో మార్పు కోరిక, అధికార పార్టీలోని విభేదాలు ఆయనకు అనుకూలంగా మారాయి. ఈ ఎన్నికను బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీపై ప్రజాభిప్రాయ సేకరణగా ప్రశాంత్ కిశోర్ ప్రచారం చేశారు.

భాజపా, ఆర్జేడీ ఓటర్ బేస్‌లో చీలిక కూడా ఆయనకు ఉపయోగపడింది. అగ్రవర్ణాల్లోని కొన్ని వర్గాలు, ముస్లిం-యాదవ్ ఓటర్లలోని కొందరు ఆయన వైపు మొగ్గు చూపారు. కులం, మతం వంటి అంశాలకు బదులు ప్రజాసమస్యలపై దృష్టి సారించి ప్రచారం చేయడం ఓటర్లను ఆకట్టుకుంది. స్వయంగా వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ ప్రజలతో మమేకమవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చి, అధికార పార్టీలోని అంతర్గత విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుని భాజపా కంచుకోటలో విజయం సాధించారు.

ఇదే సమయంలో గుజరాత్‌లోని మంజల్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ స్థానాల్లో కూడా ఉపఎన్నికలు జరిగాయి. మంజల్‌పూర్‌లో భాజపా అభ్యర్థి సతీశ్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీపై 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. దతియాలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ భాజపా అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

బాంకీపుర్ ఫలితం బిహార్ రాజకీయాల్లో కొత్త ధోరణిని సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: