Prime Minister Modi’s Advice: ప్రధాని మోదీ సలహా: మార్కులపై వ్యామోహం వద్దు, జీవిత వికాసంపై దృష్టి పెట్టండి
జీవిత వికాసంపై దృష్టి పెట్టండి
Prime Minister Modi’s Advice: పరీక్షలను భయంగా కాకుండా పండగలాగా జరుపుకోవాలని, మార్కులపై అతిగా ఆసక్తి చూపకుండా జీవన నైపుణ్యాలు, సంపూర్ణ వికాసంపై శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విద్యను భారంగా భావించకుండా, దాన్ని జీవితంలో ఒక మార్గంగా మాత్రమే చూడాలని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం ప్రధాని నివాసంలో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ 2026’ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడుతూ మోదీ ఈ విషయాలను వివరించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర బోర్డు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
‘‘గతేడాది టాపర్ పేరు ఇప్పుడు ఎవరికీ గుర్తుండదు. మార్కులకు అంత ప్రాధాన్యం లేదు. జీవితాన్ని మెరుగుపరచుకోవడమే ముఖ్యం. పరీక్షల కోసమే జీవితం కాదు. సంపూర్ణ జీవన వికాసమే లక్ష్యం కావాలి’’ అని మోదీ తెలిపారు. విద్యతో పాటు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని, నచ్చిన రంగంలో దూసుకెళ్లాలని, సులభమైన లక్ష్యాలు కాకుండా సాధ్యమైన గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు.
పరీక్షల సన్నద్ధతపై మాట్లాడుతూ, అందరూ ఒకే విధంగా చదవరని, కొందరు ఉదయం, మరికొందరు రాత్రి బాగా చదువుతారని ఆయన చెప్పారు. ఇతరుల సలహాలు తీసుకోవచ్చు కానీ, చివరికి తమకు సరిపడిన విధానాన్నే అనుసరించాలని సూచించారు. ‘‘నేను కూడా ఇప్పటికీ చాలామంది నుంచి సలహాలు అందుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో పనిచేస్తారు’’ అని ఉదాహరణగా చెప్పారు.
తన వయసు 75 ఏళ్లకు చేరినప్పుడు ఒకరు శుభాకాంక్షలు తెలిపినప్పుడు, ‘‘మరో 25 ఏళ్లు మిగిలి ఉన్నాయి’’ అని సమాధానమిచ్చానని మోదీ పేర్కొన్నారు. గతాన్ని గుర్తుచేసుకుంటూ సమయం వృథా చేయకుండా, మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు చెప్పారు.
ఇంటర్నెట్, గేమ్స్‌పై హెచ్చరిక చేస్తూ, ‘‘డేటా చౌకగా దొరుకుతోందని సమయం వృథా చేయకండి. సరదాకు గేమ్స్ ఆడితే జీవితం నాశనమవుతుంది. డబ్బు ఆశతో ఆన్‌లైన్ జూదాల్లో పడితే ప్రమాదం. మా ప్రభుత్వం అలాంటి ఆటలను ప్రోత్సహించడం లేదు. దానికి వ్యతిరేకంగా చట్టం కూడా చేశాం’’ అని మోదీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, స్వీయ విశ్వాసం, క్రమశిక్షణతో పాటు జీవితంలో సమతుల్యత పాటించాలని ప్రధాని ఒత్తిడి చేశారు.