Prime Minister Narendra Modi: వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త అవకాశాలు: ప్రధాని మోదీ
యువతకు కొత్త అవకాశాలు: ప్రధాని మోదీ
Prime Minister Narendra Modi: భారతదేశం సంస్కరణల ప్రతీకగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ లక్ష్యంతో పలు దేశాలతో వాణిజ్య మరియు మొబిలిటీ రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పారు. ఇవి భారతీయ యువతకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని ఆయన వివరించారు. 18వ రోజ్‌గార్ మేళాలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా 45 చోట్ల ఈ మేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 61 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేశారు. మోదీ మాట్లాడుతూ.. "యువతకు ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశంతో మొదలైన రోజ్‌గార్ మేళా కార్యక్రమం ఇప్పుడు ఒక పెద్ద సంస్థగా రూపుదిద్దుకుంది. ఈ వేదిక ద్వారా లక్షలాది మంది ఉద్యోగాలు సాధించారు. భారత్ సంస్కరణల వేగంతో ముందుకు సాగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా మన దేశంలో ఉంది. వారికి పూర్తి స్థాయి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. దీని కోసం మేము కట్టుబడి పని చేస్తున్నాం. వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ యువతకు విశాలమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి" అని పేర్కొన్నారు. ఇప్పటివరకు రోజ్‌గార్ మేళా ద్వారా 11 లక్షలకు పైగా యువతకు ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.