Rahul Gandhi: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ విజయం కోరుకుంటున్నారని మోదీపై రాహుల్ ఆరోపణ

మోదీపై రాహుల్ ఆరోపణ

Update: 2026-03-31 09:57 GMT

శబరిమల గోల్డ్ స్కాంపై మోదీ ఎందుకు మాట్లాడడం లేదు?

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని కన్నూరులో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీపీఐ(ఎం) అనేది వామపక్ష పార్టీ కాదని, అతి తీవ్ర రైట్ వింగ్ పార్టీ అని విమర్శించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు భాజపాతో చేతులు కలిపారని ఆరోపించారు. అందువల్లే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ విజయం సాధించాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

ఇతర చోట్ల మతం, దేవుడి గురించి మాట్లాడే మోదీ కేరళలో మాత్రం ఆ అంశాలను పూర్తిగా మరచిపోయారని రాహుల్ వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలో జరిగిన బంగారు తాపడాల స్కాం విషయంలో ఇప్పటివరకు మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. బంగారు తాపడాలు మాయమవడం వెనుక సీపీఐ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు ఉండడం వల్లే భాజపా ఈ విషయంలో మౌనం వహిస్తోందని రాహుల్ ఆరోపించారు.

సీపీఐ భాజపాతో కలిసి పనిచేయడం ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు నచ్చలేదని, అందువల్ల వారు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని రాహుల్ గాంధీ తెలిపారు.

ఇదే సభలో రాహుల్ మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ సిటీ మిషన్‌ను కూడా తీవ్రంగా విమర్శించారు. ఈ పథకం ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, మోదీ ఎప్పుడూ గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. కేంద్రం స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన ఏ నగరమూ పూర్తి అభివృద్ధి చెందలేదని, అక్కడి ప్రజలు కలుషిత నీరు, నిర్మాణ సమయంలోనే కుప్పకూలుతున్న బ్రిడ్జిలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. పౌరులకు ప్రాథమిక సౌకర్యాలు, స్వచ్ఛమైన నీరు, గాలి, భద్రత కల్పించడంలో ఈ నగరాలు పూర్తిగా విఫలమయ్యాయని, స్మార్ట్ సిటీ మిషన్ ఒక అసంపూర్ణ పథకంగా మిగిలిపోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Tags:    

Similar News