Rahul Gandhi: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అంటరానితనానికి మరో రూపమని ఆయన వ్యాఖ్యానించారు.

శనివారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళితుడనే కారణంతో మైదానాన్ని శుద్ధి చేయడం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. భారతదేశంలో అస్పృశ్యతను చట్టబద్ధంగా నిషేధించారని గుర్తు చేశారు.

శుద్ధీకరణ పూజను నిర్వహించిన వారిపై, దీనికి మద్దతు ఇచ్చిన ఉత్తరాఖండ్ స్థానిక బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులు సమాజంలో ఎదగడం, గౌరవంగా బతకడం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు ఇష్టం లేదని, ఈ ఘటన వారి కులవివక్ష భావజాలాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు.

ఆగస్టు 8న హల్ద్వానీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు. ర్యాలీ ముగిసిన రెండు రోజుల తర్వాత ‘శ్రీరామ్ సేన’ అనే స్థానిక సంస్థ గంగాజలం చల్లి, హవనం నిర్వహించి మైదానాన్ని ‘శుద్ధి’ చేసింది. దీంతో వివాదం మొదలైంది.

Tags: