Opposition Leader Rahul Gandhi: వాణిజ్య ఒప్పందం పేరిట రైతులను మోసం చేస్తున్న మోడీ : రాహుల్‌ గాంధీ ఫైర్

రైతులను మోసం చేస్తున్న మోడీ : రాహుల్‌ గాంధీ ఫైర్

Update: 2026-02-16 04:22 GMT

Opposition Leader Rahul Gandhi: అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీ చేసుకుంటోందని, ఇది రైతుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని ఆయన ఆరోపించారు. ఇది తాత్కాలిక విషయం కాదు, దీర్ఘకాలిక పరిణామాలు ఉన్నాయని హెచ్చరించారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాహుల్ గాంధీ ఐదు కీలక ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలు ఇలా ఉన్నాయి:

డీడీజీ (డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్) దిగుమతి అంటే ఏమిటి? జన్యుమార్పిడి (జీఎం) చేసిన అమెరికన్ మొక్కజొన్న నుంచి తయారైన దాణాను భారతీయ పశువులకు తినిపించడమా? ఇది మన పాల ఉత్పత్తిని అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చేయదా?

జన్యుమార్పిడి చేసిన సోయాబీన్ నూనె దిగుమతికి అనుమతిస్తే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న సోయాబీన్ రైతులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

మీరు చెబుతున్న ‘అదనపు ఉత్పత్తులు’ అంటే ఏమిటి? కాలక్రమేణా పప్పుధాన్యాలతోపాటు ఇతర అమెరికన్ పంటల దిగుమతులకు ద్వారాలు తెరవడమేనా?

వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడం అంటే జన్యుమార్పిడి పంటలపై భారత్ తన వైఖరిని మార్చడమా? ధాన్యం సేకరణ తగ్గించడం, కనీస మద్దతు ధర లేదా బోనస్‌లను తగ్గించడం వల్ల భవిష్యత్తులో భారత్ ఒత్తిడిని ఎదుర్కోకుండా ఉంటుందా?

ఒకసారి ద్వారాలు తెరిచిన తర్వాత, మరిన్ని పంటలను జోడించకుండా ఎలా ఆపగలం? దీనికి ఏవైనా రక్షణ చర్యలు ఉన్నాయా? లేక ప్రతి ఒప్పందంలో మరిన్ని పంటలను జాబితాలో చేరుస్తారా?

ఇది ఆషామాషీ విషయం కాదని, రైతుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న తీవ్రమైన అంశమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందం పేరుతో మరో దేశం భారత వ్యవసాయ రంగంపై పట్టు సాధించేందుకు అనుమతి ఇస్తున్నామా అని ప్రశ్నించారు. దేశ వ్యవసాయ స్వావలంబన, రైతుల ఆర్థిక భద్రతను కాపాడాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News