Trending News

Rammohan Issues Red Alert to IndiGo: ఇండిగోకు రామ్మోహన్ రెడ్ అలర్ట్..! “సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోం.. గట్టి చర్యలు తప్పవు” – రాజ్యసభలో ఘాటు హెచ్చరిక!

గట్టి చర్యలు తప్పవు” – రాజ్యసభలో ఘాటు హెచ్చరిక!

Update: 2025-12-08 13:06 GMT

Rammohan Issues Red Alert to IndiGo: ‘ఇండిగో సంక్షోభం’ నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సోమవారం పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేశారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలుచేయకపోవడమే సర్వీసుల రద్దుకు దారితీసిందని వెల్లడించారు. ఏవియేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ (ఏఎంఎస్‌ఎస్) ఈ అంతరాయాలకు కారణం కాదని తెలిపారు.

‘‘ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుత పరిస్థితులకు దారితీసింది. సిబ్బందికి సంబంధించిన రోస్టరింగ్ విధానాన్ని సరిగా అమలుచేయలేదు. ఈ వైఫల్యానికి ఏఎంఎస్‌ఎస్ సిస్టమ్ కారణం కాదు. డిసెంబర్ ఒకటిన రోస్టరింగ్ నిబంధనలకు సంబంధించి ఇండిగోతో సమావేశం నిర్వహించాం. ఆ సంస్థ ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలపై మేం స్పష్టత ఇచ్చాం. అప్పుడు వారు ఎలాంటి సమస్యలను ప్రస్తావించలేదు. ఇక సమస్యను పరిష్కరించేందుకు ఎయిర్‌లైన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. కొన్ని రోజులుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అంతరాయానికి చింతిస్తున్నాను. ఈ సమస్యను మేం తేలిగ్గా తీసుకోలేదు. ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించాం. భవిష్యత్తులో ఇతర ఎయిర్‌లైన్స్ నుంచి ఇలాంటివి పునరావృతం కాకుండా మా చర్యలు ఉండనున్నాయి. భారతదేశంలో కొత్త విమానయాన సంస్థ ప్రారంభం కావడానికి ఇదే మంచి తరుణం. పోటీ సంస్థలు ఏర్పాటయ్యేలా చర్చలు జరపనున్నాం’’ అని మంత్రి రాజ్యసభలో మాట్లాడారు.

ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఇండిగో సంక్షోభంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందన వచ్చింది.

ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు

ఇదిలాంటే.. ఇండిగో వ్యవహారంపై కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. కొద్దిరోజులుగా సేవల్లో అంతరాయానికి గల కారణాలను విచారించనుంది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పౌర విమానయాన శాఖ ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కె.బ్రహ్మనే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాన్‌గ్లిక్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ రాంపాల్ ఉన్నారు. వీరు భవిష్యత్తులో ఎలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా కొన్ని సిఫార్సులు కూడా చేయనున్నారు.

Tags:    

Similar News