Justice B.V. Nagarathna: పత్రికా స్వేచ్ఛకు నిజమైన ముప్పు: ప్రభుత్వ నియంత్రణలు, ఆర్థిక ఒత్తిళ్లే కారణం-జస్టిస్ బి.వి. నాగరత్న
ప్రభుత్వ నియంత్రణలు, ఆర్థిక ఒత్తిళ్లే కారణం-జస్టిస్ బి.వి. నాగరత్న
Justice B.V. Nagarathna: నిర్బంధాలు, బెదిరింపులు, ఒత్తిళ్ల నీడలో మీడియా స్వేచ్ఛగా పనిచేయలేదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న స్పష్టం చేశారు. పత్రికా స్వాతంత్య్రానికి ఏర్పడుతున్న ముప్పు ప్రత్యక్ష సెన్సార్‌షిప్ నుంచి కాకుండా, ప్రభుత్వ నియంత్రణలు, యాజమాన్య ఒత్తిళ్లు, లైసెన్సింగ్ చట్టాలు, ఆర్థిక విధానాల ద్వారా తలెత్తుతోందని ఆమె హెచ్చరించారు.
‘‘ఐపీఐ ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ జర్నలిజం’’ ప్రదానోత్సవంలో మాట్లాడిన జస్టిస్ నాగరత్న, పత్రికా రంగాన్ని కబళించే ప్రయత్నాలు ఆర్థికంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయని వివరించారు.
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చట్టబద్ధంగా ప్రతి మీడియా సంస్థకు ఉందని, అయితే ప్రభుత్వం విధించే ఆర్థిక పరిమితులు, ఒత్తిళ్ల నేపథ్యంలో అలాంటి విమర్శలు చేస్తే సంస్థలు తీవ్ర నష్టాలు భరించాల్సి వస్తుందని ఆమె చెప్పారు. మీడియా స్వతంత్రంగా పనిచేయకుండా ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రజలకు నిజాలు చేరడం కష్టమవుతుందని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకుర్, పీటీఐ వార్తా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ జోషి కూడా పాల్గొని ప్రసంగించారు. పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు సమాజం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరూ ఒకే స్వరంలో అభిప్రాయపడ్డారు.