Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు- కేజ్రీవాల్, కవితతోపాటు 22 మందికి క్లీన్‌చిట్
కేజ్రీవాల్, కవితతోపాటు 22 మందికి క్లీన్‌చిట్
సీబీఐ అభియోగాలు నిరాధారమని కొట్టివేత
కేజ్రీవాల్ భావోద్వేగం.. ఆప్ కార్యకర్తలు సంబరాలు
Delhi Liquor Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం విధాన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతోపాటు మరో 20 మంది నిందితులకు భారీ ఊరట లభించింది. దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. వీరందరిపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, కేసు నుంచి పూర్తి విముక్తి కల్పించింది.
ప్రత్యేక జడ్జి జితేంద్ర సింగ్ తన 598 పేజీల విస్తృత తీర్పులో సీబీఐ అభియోగాలను నిరాధారమని, స్పష్టమైన ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా నిందితులను ఇరికించారని తీవ్రంగా మండిపడ్డారు. దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఎలాంటి కుట్ర లేదని, నేరం జరగలేదని స్పష్టం చేశారు. సీబీఐ అభియోగపత్రంలో అనేక లోపాలు ఉన్నాయని, సాక్షుల వాంగ్మూలాలతో అభియోగాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. ఒక సాక్షి మాటల్లో కేజ్రీవాల్ పేరు ప్రస్తావన వచ్చినందుకే ఆయనపై కేసు పెట్టారని, అది సరిపోదని అభిప్రాయపడ్డారు.
‘సౌత్ గ్రూప్’ అనే పదం వాడకంపై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మద్యం విధానాన్ని కొందరికి ప్రయోజనం చేకూర్చేలా మార్చారనే ప్రధాన ఆరోపణను తిరస్కరించింది. ఈ పాలసీ చట్టబద్ధమైన చర్చలు, సంప్రదింపులు, సంబంధిత సంస్థల ఆమోదంతోనే రూపొందిందని, లెఫ్టినెంట్ గవర్నర్ సలహాలను కూడా పాటించారని తెలిపింది. అవినీతి ద్వారా సమకూరిన డబ్బును గోవా అసెంబ్లీ ఎన్నికలకు వాడారనే ఆరోపణను సీబీఐ వాదనలను సమర్థించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కోర్టు భావించింది. దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగిందని, నిందితులను దీర్ఘకాలం జైలు ఉంచడం వారి స్వేచ్ఛను హరించిందని వ్యాఖ్యానించింది.
తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆప్ కార్యకర్తలు ఆయన నివాసం, పార్టీ కార్యాలయాల వద్ద సంబరాలు చేసుకున్నారు. అయితే, సీబీఐ ఈ తీర్పును సవాల్ చేస్తూ వెంటనే దిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. దర్యాప్తులోని పలు అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి.
ఈ తీర్పు ఆప్ పార్టీకి పెద్ద ఊపిరి పోసినట్లైంది. దీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న నేతలకు విముక్తి లభించడంతో పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.