Sharad Pawar: మహారాష్ట్రలో ఎన్‌సీపీ పార్టీలో ఏర్పడిన రెండు వర్గాల విలీనం విషయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు జోక్యం చేసుకునే అర్హత లేదని ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఇటీవల ఎన్‌సీపీ వర్గాల విలీనంపై సీఎం ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అజిత్ పవార్ తనతో అన్ని విషయాలు చర్చించేవారని, పార్టీ విలీనం నిజమైతే ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చేవారని ఫడణవీస్ అన్నారు. అయితే, అలాంటిది ఏమీ జరగలేదని, అజిత్ మరణం తర్వాతే ఇలాంటి ప్రచారాలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ శరద్ పవార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

"ఎన్‌సీపీ రెండు వర్గాల విలీనం విషయంపై అజిత్ పవార్ సానుకూలంగా ఉండేవారు. గత రెండు నెలలుగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌తో చర్చలు సాగిస్తున్నారు. ఈ చర్చల్లో సీఎం ఫడణవీస్ పాల్గొనలేదు. అలాంటప్పుడు ఈ వ్యవహారంపై మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడిది?" అని శరద్ పవార్ ప్రశ్నించారు. అజిత్ అకాల మరణంతో తమ కుటుంబంలో విషాద వాతావరణం నెలకొందని, ప్రస్తుతం రాజకీయ చర్చలు చేసే సమయం కాదని అన్నారు. సునేత్రా పవార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్టీకి మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు అండగా ఉండటమే తమ ముందున్న ప్రధాన బాధ్యత అని శరద్ పవార్ పేర్కొన్నారు.

Tags: