Supreme Court Orders: వాయు కాలుష్య నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సమర్పించండి: సుప్రీంకోర్టు ఆదేశం

సుప్రీంకోర్టు ఆదేశం

Update: 2026-01-22 05:49 GMT

Supreme Court Orders: దేశ రాజధాని దిల్లీని తీవ్ర వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది. కాలుష్యంతో ఊపిరి ఆడకుండా పోతున్న దిల్లీ ప్రజలకు తక్షణ ఊరట కల్పించేందుకు కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఈ మేరకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) సూచించిన సిఫార్సులను ఎలా అమలు చేస్తారో వివరిస్తూ, రాబోయే 4 వారాల్లోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఇకపై కాలుష్య నివారణ విషయంలో ఎలాంటి సాకులు, అభ్యంతరాలకు తావు ఇవ్వబోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలితో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసును విచారించింది. దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా ఈ సమస్యను అరికట్టడానికి సమగ్ర చర్యలు అవసరమని ఉద్ఘాటించింది.

సీఏక్యూఎం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. దిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు మొత్తం 15 ముఖ్యమైన దీర్ఘకాలిక చర్యలను సీఏక్యూఎం సిఫార్సు చేసిందని తెలిపారు. ఈ చర్యల అమలులో జాప్యం జరగకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.

కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను దశలవారీగా రోడ్ల నుంచి తొలగించడం, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) విధానాన్ని మరింత బలోపేతం చేయడం, రైలు రవాణా వ్యవస్థ, మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించడం, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా పాలసీలు సవరించడం వంటి ముఖ్య సిఫార్సులను సీఏక్యూఎం చేసింది.

ఈ ఆదేశాలతో దిల్లీలో వాయు కాలుష్య సమస్యపై త్వరిత, సమగ్ర చర్యలు చేపట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది.

Tags:    

Similar News