Supreme Court: సుప్రీంకోర్టు: ఇస్లాంకు మారినవారికి ఆటోమేటిక్గా రిజర్వేషన్ లభించదు
లభించదు
తమిళనాడు ప్రభుత్వ నోటిఫికేషన్ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది
Supreme Court: హిందూ వెనుకబడిన వర్గాల నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు కేవలం మతం మార్చుకున్నంత మాత్రానే ముస్లిం వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ ప్రయోజనాలను ఆటోమేటిక్గా పొందలేరని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది.
తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చి 9న ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసి, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, డి-నోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాల వారు ఇస్లాంకు మారిన తర్వాత కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు కోల్పోకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. ఈ ఉత్తర్వును మద్రాస్ హైకోర్టు 2025 జూన్ 25న కొట్టివేసింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.
సుప్రీంకోర్టు ఈ అప్పీలును కొట్టివేస్తూ, ఇలాంటి నోటిఫికేషన్ “కృత్రిమ వర్గం”ను సృష్టిస్తుందని పేర్కొంది. ఒక వెనుకబడిన హిందూ వర్గం వ్యక్తి ఇస్లాంకు మారినంత మాత్రానే నోటిఫైడ్ వెనుకబడిన ముస్లిం వర్గంలో సభ్యుడు కాడని స్పష్టం చేసింది.
ఏదైనా వర్గాన్ని వెనుకబడినదిగా నోటిఫై చేసి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలంటే, దానికి ముందు చట్టబద్ధమైన సామాజిక పరిశీలనలు, డేటా సేకరణ జరగాలని ధర్మాసనం సూచించింది.
ఈ కేసు తూత్తుకుడి జిల్లాకు చెందిన సమీర్ అహమ్మద్కు సంబంధించినది. హిందూ కుటుంబంలో జన్మించిన అతడు 2015లో ఇస్లాంకు మారాడు. ‘ముస్లిం లెబ్బై’గా కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నా తహసీల్దార్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు.
మద్రాస్ హైకోర్టు తన తీర్పులో, ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి హిందూ కులం లేదా ఉపకులం ఆధారంగా వెనుకబడిన వర్గ హోదాను కొనసాగించలేడని పేర్కొంది. ఇస్లాం సమానత్వాన్ని ప్రబోధిస్తుందని, కుల వ్యవస్థను గుర్తించదని హైకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు 1951లోని మద్రాస్ హైకోర్టు తీర్పును (జి. మైఖేల్ వర్సెస్ ఎస్. వెంకటేశ్వరన్) సూచిస్తూ, రిజర్వేషన్ ప్రయోజనాలు కులం ఆధారంగా కాకుండా, సామాజిక, విద్యా వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది.