Supreme Court’s Straight Talk: సుప్రీంకోర్టు సూటి మాట: ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు.. ప్రశాంత్ కిశోర్ పార్టీకి షాక్
ప్రశాంత్ కిశోర్ పార్టీకి షాక్
బిహార్ ఎన్నికల ఫలితాల సవాల్‌పై పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం.. "న్యాయవేదికను ప్రచారానికి వాడకండి" అని హెచ్చరిక
Supreme Court’s Straight Talk: ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి సుప్రీం కోర్టులో భారీ దెబ్బ తగిలింది. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తిరస్కరించింది. ఈ సందర్భంగా ప్రజలే మీ పార్టీని తిరస్కరించారని, ఓడిపోయిన తర్వాత న్యాయవేదికను ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బిహార్‌లోని 243 స్థానాల్లో 238 ఎన్నికల్లో పోటీ చేసిన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, గెలిచిన కూటమి సభ్యులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, మహిళలకు ఒక్కోరికి రూ.10 వేలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ జన్ సురాజ్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కారణంగా ఎన్నికల ఫలితాలు చెల్లవని, తాజా ఎన్నికలు జరపాలని కోరింది.
అయితే, సీజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. "మీ పార్టీ ఎన్ని ఓట్లు సాధించింది? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు కదా.. ఇప్పుడు న్యాయస్థానాన్ని ప్రజాదరణ పొందడానికి ఉపయోగిస్తున్నారా?" అని సీజే తీవ్రంగా ప్రశ్నించారు. ఇలాంటి విషయాల్లో సామాన్యులు కోర్టుకు రావడాన్ని స్వాగతిస్తామని, కానీ రాజకీయ పార్టీలు ఓడిపోయిన తర్వాత ఇలా చేయడం సరికాదని అన్నారు. "మీరు అధికారంలోకి వచ్చినా ఇదే చేస్తారా?" అని కూడా వ్యాఖ్యానించారు.
ఇంకా ఏవైనా ఫిర్యాదులు ఉంటే బిహార్ హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. ఈ వ్యాఖ్యలతో ప్రశాంత్ కిశోర్ పార్టీకి మరోసారి ఎన్నికల ఓటమి గుర్తు చేసినట్లైంది.