Uddhav Thackeray: ద్రోహులకు సమయం ఉంది.. నిరసన చేస్తున్న యువతకు లేదు: ప్రధాని మోదీపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు
ప్రధాని మోదీపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు
Uddhav Thackeray: శివసేన (యూబీటీ)ను వీడి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనలో చేరిన తిరుగుబాటు ఎంపీలతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కావడంపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువతను కలవడానికి సమయం లేని ప్రధాని ద్రోహులను కలవడానికి మాత్రం సమయం కేటాయించారని ఆయన దుయ్యబట్టారు.
శిందే వర్గానికి చెందిన పార్టీనే అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటనపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తమను భయపెట్టాలనే ఉద్దేశంతోనే అండగా ఉంటామని మోదీ వారికి హామీ ఇస్తున్నారని ఉద్ధవ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా ఉంటుందన్నదే తన ఏకైక ఆశ అని, ఆ విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని ఠాక్రే పేర్కొన్నారు. మరోవైపు ప్రత్యర్థి శివసేనలో ఆరుగురు ఎంపీల విలీనాన్ని గుర్తిస్తూ లోక్‌సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.దిల్లీలో ఇటీవల జరిగిన జెన్‌జీ నిరసనలు కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేశాయని ఠాక్రే అన్నారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తుపానుకు ముందు ప్రశాంతతే అని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వం ఏ తప్పు చేసినా వారు ప్రశ్నిస్తూనే ఉంటారని, మొత్తం ప్రభుత్వాన్నే మార్చాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. యువతకు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం పోలీసులతో వారిని కొట్టించిందని విమర్శించారు. కొవిడ్ సమయంలో ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లు నిర్వహించినందుకు తనను విమర్శించిన వారే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.