Prime Minister Narendra Modi: వ్యవస్థీకృత అంతరాలను సరిచేసేందుకు సాహసోపేత సంస్కరణలు చేపట్టాం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

సాహసోపేత సంస్కరణలు చేపట్టాం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Update: 2026-02-16 03:22 GMT

Prime Minister Narendra Modi: ఉత్పాదకత పెంపు, దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, స్వల్పకాలిక ప్రజాకర్షక పథకాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వాలు వదిలిపెట్టిన వ్యవస్థీకృత అంతరాలను సరిచేస్తున్నామని, సాహసోపేత సంస్కరణలతో వికసిత భారత్‌కు బలమైన పునాదులు వేశామని ఆయన పేర్కొన్నారు. తాజా కేంద్ర బడ్జెట్ ఈ ప్రస్థానానికి మరింత ఊతమిస్తుందని, సంస్కరణల 'ఎక్స్‌ప్రెస్'ను వేగవంతం చేస్తుందని చెప్పారు.

పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆర్థిక వృద్ధి, వాణిజ్య ఒప్పందాలు, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగ ఆధునీకరణ, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలపై ఆయన వివరంగా మాట్లాడారు.

బడ్జెట్ దీర్ఘకాలిక దృష్టితో రూపొందింది

"మా ప్రభుత్వం ఉత్పాదకతను పెంచేలా ఖర్చులు రూపొందించింది. అందుకే ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లలేదు. ఉద్యోగావకాశాలు, సుస్థిరాభివృద్ధికి ఊతమిచ్చే మౌలిక సదుపాయాలకు రికార్డు కేటాయింపులు చేశాం" అని మోదీ తెలిపారు. రైళ్లు, రహదారులు, విద్యుత్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, రూ.12.2 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలకు కేటాయించామని వివరించారు.

"స్వల్పకాలిక ఆకర్షణల బదులు ప్రజల జీవన నాణ్యత పెంచి, దేశాభివృద్ధిని వేగవంతం చేయాలనే సంకల్పంతో ఇది రూపొందింది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. విమానాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, తీరప్రాంతాల అనుసంధానంపై దృష్టి సారించాం" అని ఆయన అన్నారు.

విదేశీ పెట్టుబడుల్లో విశ్వాసం పెరిగింది

రాజకీయ స్థిరత్వం వల్ల విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగిందని మోదీ పేర్కొన్నారు. 38 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, తయారీ, సేవలు, ఎంఎస్‌ఎంఈ రంగాల బలంతో సాధికారతతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. త్వరలో మరో మూడు ఒప్పందాలు కుదురుతాయని, సున్నా టారిఫ్‌తో ఎగుమతులు చేస్తున్నామని వివరించారు.

యూపీఏ కాలంలో అవ్యవస్థ

యూపీఏ పాలనలో ఆర్థిక అవ్యవస్థ ఉండటంతో వాణిజ్య చర్చల్లో విశ్వాసం లేకుండా పోయిందని మోదీ విమర్శించారు. ఇప్పుడు అనేక దేశాలు, కూటములతో వరుస ఒప్పందాలు కుదురుతున్నాయని, ఒక దశాబ్దం క్రితం మన స్థితి గుర్తుచేసుకోవాలని అన్నారు.

రాబోయే దశాబ్దానికి మూడు ప్రాధాన్యాలు

సంస్థాగత సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లడం, నవకల్పనలను బలోపేతం చేయడం, సులభతర పాలన అమలు చేయడం – రాబోయే దశాబ్దానికి ఇవే తన మూడు ప్రాధాన్యాలని మోదీ తెలిపారు. ఆర్థిక సర్వే ప్రకారం వృద్ధి 7 శాతంగా ఉంటుందని, దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ అభివృద్ధి ప్రయోజనాలు చేకూరుతాయని, తన ఆలోచనలన్నీ దీర్ఘకాలిక దృష్టితోనే ఉన్నాయని ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

Tags:    

Similar News