Prime Minister Narendra Modi: నారీ శక్తికి సాధికారికత - అందరూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి: ప్రధాని మోదీ

అందరూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి: ప్రధాని మోదీ

Update: 2026-04-09 03:25 GMT

Prime Minister Narendra Modi: దేశం ఇప్పుడు ఒక చారిత్రక ఘడియను ఎదుర్కొంటోంది. జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాల్లో విభేదాలను పక్కన పెట్టి, సమైక్యతతో ముందుకు సాగాల్సిన సమయం ఇది. భారత్ సమైక్యంగా పనిచేసే సామర్థ్యాన్ని నిరంతరం నిరూపిస్తూనే ఉంది. కలిసి ముందుకు సాగుదాం. జాతీయ పురోగతి కోసం నారీ శక్తికి సాధికారికత కల్పించి, రాజ్యాంగ విలువలను బలోపేతం చేద్దాం.

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే పర్వదినాల ఆనందోత్సాహాల్లో ప్రజలు మునిగిపోతారు. ఈ పండుగలు జరుపుకునే దేశ-విదేశాల్లోని భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈ నెల 11న మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తాం. ఈ ప్రత్యేక సందర్భాలు మన హృదయాల్లో నవస్ఫూర్తిని నింపుతాయి. అంతేకాకుండా, దేశం ఒక ముఖ్యమైన చారిత్రక క్షణం ముంగిట నిలుచుంది. ఇది మన ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసే అవకాశం ఇస్తుంది. సమానత్వం, సశక్తీకరణకు మనందరం సమష్టిగా కట్టుబడి ఉన్నామని తెలిపే సందర్భం కూడా ఇది.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపేందుకు పార్లమెంటు ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలను ప్రతిబింబించాలి. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని (నారీ శక్తి వందన్ అధినియమ్) త్వరగా అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఈ బిల్లు ద్వారా సాధ్యమవుతాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతు పలకాలి. జాతీయ ప్రయోజనానికి పథనిర్దేశం చేస్తూ, వీలైనంత విస్తృతంగా ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. రాజకీయ పక్షాల మధ్య విభేదాలను పక్కన పెట్టి, ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన తల్లులు, సోదరీమణుల హక్కు 40 ఏళ్లుగా వాయిదా పడుతోంది. 2029 ఎన్నికల్లో ఇది అమలులోకి రావాలి.

నారీ శక్తి సాధికారికత ద్వారా దేశం మరింత బలోపేతమవుతుంది. సమానత్వం, సమాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. అందరూ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి, దేశ పురోగతికి తోడ్పడాలి.

Tags:    

Similar News