కాంగ్రెస్ కార్యకర్తల్లా కొందరు పోలీసులు

బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దౌర్జన్యం -కెటిఆర్;

Update: 2025-07-07 10:24 GMT

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. మంత్రి సీతక్క అనుచరుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ చేస్తున్న శాంతియుత ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు.

పోలీస్ యాక్ట్ పేరుతో బీఆర్ఎస్ శాంతియుత నిరసనను అడ్డుకున్న ములుగు పోలీసులు, కాంగ్రెస్ నేతల పర్యటనకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఆ పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తున్నారన్న సంగతి అర్థం అవుతుందన్నారు. నిన్న అర్థరాత్రి నుంచే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా గ్రామాలపై దొంగల లెక్క విరుచుకుపడ్డ పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏం పోలీసింగ్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎవరి ఆదేశాల మేరకు దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరి 2 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారో ములుగు పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కొంతమంది పోలీసులకు న్యాయస్థానాల్లో చివాట్లు పడుతున్నా ఇంకా సోయి రావడం లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ములుగు నియోజకవర్గంలో తన సొంత రాజ్యాంగం అమల్లో ఉందని భ్రమిస్తున్న మంత్రి సీతక్క, ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇసుక అక్రమ రవాణా పేరుతో సీతక్క చేస్తున్న ఇల్లీగల్ దందాల గురించి ములుగులో ఉన్న చిన్నా, పెద్దా అందరికి తెలిసిపోయిందన్నారు. ఫారెస్ట్ అధికారులను ముందటపెట్టి గిరిజనులపై చేయిస్తున్న దాష్టికాలను సీతక్క తక్షణం ఆపేయాలన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు ఆ అన్యాయాన్ని ప్రశ్నించిన చుక్క రమేశ్ ను తన అనుచరులతో వేధించిన సీతక్క తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాము వేసుకున్నది కాంగ్రెస్ కండూవా కాదు, ఖాకీ యూనిఫాం అని ఇప్పటికైనా పోలీసులు గ్రహించి బుద్దితెచ్చుకుని చుక్క రమేశ్ చావుకు కారణమైన సీతక్క అనుచరులపై కేసు నమోదుచేయాలన్నారు కేటీఆర్. లేకుంటే బీఆర్ఎస్ తరుపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ములుగు జిల్లాలో సీతక్క చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News