Eetala Rajender: ఈటల రాజేందర్: బీసీలు మేమెంతో మాకంత కావాలి.. యాచించే స్థాయిలో కాదు, రాజ్యాధికారం కోరుకుంటున్నాం

యాచించే స్థాయిలో కాదు, రాజ్యాధికారం కోరుకుంటున్నాం

Update: 2025-10-18 10:52 GMT

Eetala Rajender: బీసీలకు రిజర్వేషన్లలో న్యాయం కల్పించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన, తమిళనాడు మాత్రమే రిజర్వేషన్లను నిజాయితీగా అమలు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల సర్వే చేపట్టి, కమిషన్ కూడా ఏర్పాటు చేశారని, కానీ అమలులో నిజాయితీ లేకపోయిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం పేరుకు కమిషన్లు వేసి, నిజమైన చర్యలు తీసుకోకపోతోందని ఆరోపించారు.

బీసీలు రాష్ట్రంలో 52 శాతం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం అని 'కాకి లెక్కలు' చెబుతోందని ఈటల రాజేందర్ ఆక్షేపించారు. "నేను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీసీలం మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబానికే అధికారం దక్కుతుంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ లేదా ట్రైబల్ ముఖ్యమంత్రి కూడా రాలేదు" అని ఆయన అన్నారు.

తెలంగాణలో బీసీలకు 8 మంది మంత్రులు ఉండాల్సి ఉండగా, కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని, వారికి కూడా చిన్న శాఖలు మాత్రమే కేటాయించారని ఆయన అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు స్థానం ఇవ్వకపోవడం విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఆరోపించారు. ప్రధాని మోదీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారని, మోదీ క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని ప్రస్తావించారు. భాజపా నిజాయితీని ఎవరూ శంకించలేరని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మాత్రమే కాకుండా చట్టసభల్లో కూడా అమలవ్వే వరకు కొనసాగుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. "మాది యాచన కాదు, పాలించే శక్తి మాకు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో, బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుంది. ఆ ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దాం" అని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News