ఆగస్టు 4న నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

నల్గొండకు YIIRS మంజూరు

Update: 2025-07-30 11:14 GMT

రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు సంబంధిత అధికారులు,కన్సల్టెన్సీ తో మంత్రుల నివాస సముదాయంలోని తన క్యాంపు కార్యాలయంలో నల్గొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ, మినిస్టర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం పై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆగస్టు 4న ఉదయం నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ ఉంటుందని,అదే రోజు ఇటీవల నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా నల్గొండ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనాలను మంత్రి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు.

22 ఎకరాల్లో 5,36,194 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు 200 కోట్ల అంచనాతో అధునాతన హంగులతో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేయనున్నామని మంత్రి వెల్లడించారు. అకాడమీ బిల్డింగ్స్,స్టాఫ్ బిల్డింగ్స్, ప్లే గ్రౌండ్, థియేటర్,విద్యార్థులకు స్కిల్ డెవల్మపెంట్ లాంటి బ్లాకులు ప్రత్యేకంగా ఉండనున్నాయన్నారు. భూమి పూజ అయిన తర్వాత ఎక్కడ రాజీ పడకుండా..నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ 18నెలల నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ పేద విద్యార్థులకు కార్పోరేట్ కు దీటుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను,వరల్డ్ క్లాస్ స్కిల్స్ ను అందించే రెడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారి జీవన శైలిలో గణనీయమైన మార్పు వస్తుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఈ(YIIRS)రెసిడెన్షియల్ స్కూల్ వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ఆధికారులు ప్రత్యేక చొరవతో మనసు పెట్టి పనిచేయాలని చెప్పారు.

నల్గొండకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమీక్షలో ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్,కన్సల్టెన్సీ ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News