2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 7న భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రధాన దశ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన ఈ రెండు జట్లు మరోసారి ప్రపంచకప్‌లో తలపడబోతుండటంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.

భారత్‌కు టోర్నీలో మరో కీలక మ్యాచ్ అక్టోబర్ 10న ఉంది. ఆ రోజు జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఐసీసీ ప్రకటించిన గ్రూప్ ఏలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే, ఒక క్వాలిఫయర్ జట్టు ఉన్నాయి. గ్రూప్ దశలోనే భారత్‌కు రెండు ముఖ్యమైన మ్యాచ్‌లు ఎదురుకానున్నాయి.

2027 ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. రెండు గ్రూపులుగా జట్లను విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి సూపర్-7 దశకు చేరతాయి. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన రికార్డు ఉన్న మరో జట్టుకు కూడా సూపర్-7లో చోటు దక్కుతుంది. కొత్త ఫార్మాట్‌లో ప్రపంచకప్ నిర్వహించనున్నారు.

ఇక 2027 ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. ఈ ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా ఆతిథ్య దేశాలుగా వ్యవహరించనున్నాయి. ప్రపంచకప్ ప్రధాన దశకు ముందు అక్టోబర్ 2 నుంచి నమీబియాలో మూడు జట్ల సూపర్ సిరీస్ జరగనుంది. దాని ద్వారా చివరి క్వాలిఫయర్ జట్టు ఖరారు కానుంది.

Tags: