Atithi Moreshwar Chaukhande: నాగ్‌పూర్‌లో విషాదం.. యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య!
యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య!
Atithi Moreshwar Chaukhande: నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటనలో 17 ఏళ్ల యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) జట్టులో ఎంపిక కాకపోవడంతో మనస్తాపం చెందినే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మృతురాలిని అకోలాకు చెందిన అతితి మోరేశ్వర్ చౌఖండేగా గుర్తించారు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా రాణించాలనే లక్ష్యంతో ఆమె గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి నాగ్‌పూర్‌లోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఉంటున్నారు. అక్కడి సర్వే క్రికెట్ అకాడమీలో ఆమె శిక్షణ పొందుతున్నారు. ఆమె సోదరుడు కూడా ఒక క్రికెటరే కావడం విశేషం.
నాగ్‌పూర్‌లోని లక్ష్మీనగర్ జైన్ ఆలయం సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంట్లో అతితి ఉరివేసుకుని ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదర్భ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ ప్రాసెస్‌లో తన పేరు రాలేదని, తాను ఎంపిక కాలేదంటూ ఆ నోట్‌లో ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. "నా సెలక్షన్ కాలేదు" (మేరా సెలక్షన్ నహీ హువా) అని అందులో రాసి ఉంది.
నాగ్‌పూర్ బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చేతన్ చౌహాన్ ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. అతితి, ఆమె సోదరుడు ఇద్దరూ క్రికెటర్లేనని, అయితే ఇటీవల ఆమె సోదరుడు వీసీఏ జట్టుకు ఎంపికయ్యాడని తెలిపారు.
గత రెండేళ్లుగా క్రికెట్ సాధన చేస్తూ ఎంపిక కోసం అతితి ఎంతో శ్రమించిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. రోజులాగే ఉదయం 5:30 గంటలకు తల్లి నిద్రలేచి చూసేసరికి అతితి వంటగదిలో ఉరివేసుకుని కనిపిపించిందని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని చెప్పారు.
ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అక్కడ ఒక సూసైడ్ నోట్ లభించిందని తెలిపారు. తన సోదరుడిని ఉద్దేశించి రాసిన ఆ లేఖలో, "నాకు సెలక్షన్ రాలేదు, కానీ నీకు వచ్చింది. నువ్వు బాగా ఆడు, జీవితంలో నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను" అని అతితి పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.