Badminton World Championship: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలోకి మెగా టోర్నీ
మెగా టోర్నీ
Badminton World Championship: భారత క్రీడా చరిత్రలో మరో అద్భుతమైన క్షణానికి వేళయింది! సరిగ్గా పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ సమరానికి మన దేశం వేదికవుతోంది.న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం ఇందుకు ముస్తాబైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన టాప్ షట్లర్లు పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.
పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ అలాగే మిక్స్‌డ్ డబుల్స్... ఇలా అన్ని విభాగాల్లోనూ హోరాహోరీ పోరు ఖాయం. ఇక మన భారతీయ షట్లర్ల విషయానికి వస్తే... సొంతగడ్డపై, మన సొంత అభిమానుల అభినందనల నడుమ పతకం సాధించాలన్న కసితో మన ఆటగాళ్ళు సిద్ధమయ్యారు.
మహిళల సింగిల్స్‌లో మన స్టార్ ప్లేయర్, పీవీ సింధుతో పాటు యువ సంచలనం ఉన్నతి హుడా... పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక డబుల్స్‌లో మన దేశం తరఫున పతకంపై కన్నేసిన అగ్రశేణి జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి జంటపై భారీ అంచనాలున్నాయి. వారితో పాటు త్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్, ధ్రువ్ కపిల - తనీషా క్రాస్టో జోడీలు కూడా బరిలో దిగుతున్నాయి.
ఈ పోరు షెడ్యూల్ ఇలా :
తొలి రెండు రోజులు అనగా సోమవారం, మంగళవారాల్లో తొలి రౌండ్ మ్యాచ్‌లు...
బుధవారం రెండో రౌండ్...
గురువారం ప్రీ-క్వార్టర్స్...
శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్...
శనివారం సెమీస్ ఉత్కంఠ ఉంటే...
ఇక ఆదివారం నాడు మహా సమరమైన ఫైనల్స్ జరుగనున్నాయి