BCCI: బీసీసీఐకి పెరిగిన గాయాల భారం.. ఆటగాళ్ల చికిత్స కోసం రూ.127 కోట్ల బడ్జెట్!
రూ.127 కోట్ల బడ్జెట్!
BCCI: భారత క్రికెట్‌లో ఆటగాళ్ల గాయాల సమస్యపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆటగాళ్లకు చికిత్స అందించడం, గాయాల నుంచి కోలుకునేలా చేయడం, ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) బడ్జెట్‌ను భారీగా పెంచినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్‌ను రూ.92 కోట్ల నుంచి రూ.127 కోట్లకు పెంచినట్లు సమాచారం.
గత ఏడాది కాలంలోనే 32 మంది కీలక ఆటగాళ్లకు గాయాలకు సంబంధించిన చికిత్స అందించినట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ వంటి టోర్నీలతో ఆటగాళ్లపై పని భారం పెరుగుతుండటంతో గాయాల నిర్వహణ కీలకంగా మారింది. ఆటగాళ్లు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంపై బీసీసీఐ దృష్టి సారిస్తోంది.
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఆటగాళ్లు తరచూ గాయపడటంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను కాపాడటం, గాయాలు తిరగబెట్టకుండా చూడటం జట్టు విజయావకాశాలకు కీలకం కానుంది.