BCCI : భారత క్రికెట్ జట్టులో కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహాగానాలకు బీసీసీఐ ఎండ్‌కార్డ్ వేసింది! ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా రోహిత్ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు.రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడని.. జట్టులో అతని స్థానంపై ఎలాంటి సందేహాలు లేవని సైకియా స్పష్టం చేశారు. రోహిత్ భవిష్యత్తులోనూ భారత జట్టుతో పాటే కొనసాగుతాడని తేల్చిచెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే సమావేశంలో ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఏడాదిలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు ఆడటం వల్ల ప్లేయర్లపై పడుతున్న తీవ్రమైన భారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక సిరీస్‌లకు ముందు ఆటగాళ్లకు తగిన విశ్రాంతిని ఇస్తామని.. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు తగిన సమయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఎఫ్‌టీపీ (FTP) రూపకల్పనలో ఈ అంశాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

అంతేకాకుండా, 2027 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని అప్పుడే స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ప్లేయర్లకు తరచూ గాయాలవుతున్న నేపథ్యంలో వాటి నివారణకు ప్రత్యేక మెడికల్, ఫిట్‌నెస్ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఇక సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పదవీకాలం పొడిగింపుపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ నెల 19 నుంచి జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్లకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యుత్తమ వసతులు కల్పిస్తామని.. అవసరమైతే బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగి అన్ని ఏర్పాట్లు చేస్తుందని దేవజిత్ సైకియా భరోసానిచ్చారు!

Tags: