Blind Asia Cup: అంధుల ఆసియా కప్ (Blind Asia Cup) పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని టీమ్ ఇండియా కెప్టెన్ టి. దుర్గారావు ఆరోపించారు. వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే ఫైనల్ రద్దు కాగా, నెట్ రన్ రేట్ ఆధారంగా పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌లోని ఢాకా ఏబీజీ స్పోర్ట్స్ సిటీలో జరగాల్సిన ఫైనల్‌కు భారత జట్టు ఉదయం 10 గంటల నుంచే మైదానంలో సిద్ధంగా ఉందని దుర్గారావు వివరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. అంపైర్లు కట్‌ఆఫ్ టైమ్ సాయంత్రం 4.15 గంటల వరకు ఉంటుందని తెలిపారు. అయితే 4 గంటలకే రన్ రేట్ ఆధారంగా పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటిస్తున్నామని మ్యాచ్ రిఫరీ చెప్పడంతో భారత ఆటగాళ్లు, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

‘‘అసలు మ్యాచే మొదలుకాకముందు రన్ రేట్ ఆధారంగా ఒక జట్టును విజేతగా ప్రకటించే విధానం ఈ టోర్నమెంట్ నిబంధనల్లో లేదు. ఆ నిబంధన ఉండి ఉంటే మేం అంగీకరించేవాళ్లం. కానీ అంధుల క్రికెట్ నిబంధనల్లో ఎక్కడా అలాంటి ప్రస్తావన లేదు. మాకు అన్యాయం జరిగింది. ఇది చిన్న టోర్నమెంట్ కాదు.. ఆసియా కప్. పెద్ద పెద్ద జట్లు ఆడుతున్నాయి. నిబంధనలను స్పష్టంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’’ అని దుర్గారావు అన్నారు.

భారత జట్టు మేనేజర్ ధీరజ్ సెక్వేరా కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ టెక్నికల్ టీమ్ వైఫల్యమే ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. టెక్నికల్ డైరెక్టర్ తాహీర్ భట్ పాకిస్తాన్ జట్టు ఫిజియోగా వ్యవహరిస్తున్నారని, కౌన్సిల్ ప్రెసిడెంట్ సయ్యద్ సుల్తాన్ షా పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ జట్టు ఛైర్మన్‌గా ఉన్నారని పేర్కొన్నారు. కీలక పదవుల్లో ఉన్న పాక్ సభ్యులు అధికారాలను దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు.

వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ కార్యదర్శి జనరల్ రజనీశ్ హెన్రీ స్వయంగా అక్కడే ఉండి ఈ నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేశారని సెక్వేరా తెలిపారు. ఆస్ట్రేలియాలోని గ్లోబల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రేమండ్ మాక్స్‌లీన్ కూడా ఈ నిర్ణయం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు.

భారత అంధుల క్రికెట్ అసోసియేషన్ (CABI) ఈ నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఫైనల్ ఆడకుండానే పాకిస్తాన్‌ను ఏకైక విజేతగా ప్రకటించడం అన్యాయమని, రెండు జట్లనూ ఉమ్మడి విజేతలుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. భారత జట్టు ట్రోఫీ ప్రదానోత్సవాన్ని బహిష్కరించింది. ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకు భవిష్యత్తులో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని కూడా భావిస్తున్నట్లు సమాచారం.

కెప్టెన్ దుర్గారావు, మేనేజర్ సెక్వేరా ఇద్దరూ టోర్నమెంట్ నిబంధనలను స్పష్టంగా పరిశీలించాలని, క్రీడా స్ఫూర్తిని పాటించాలని పిలుపునిచ్చారు. మైదానంలో ఆడి గెలిస్తే ఎవరి విజయాన్నైనా అంగీకరిస్తామని, ఇలా ఏకపక్షంగా ట్రోఫీ ఇవ్వడం మాత్రం ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ వివాదం అంధుల క్రికెట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నిర్వాహకులు తక్షణం స్పందించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.

వర్షం కారణంగా రద్దైన ఫైనల్‌లో రన్ రేట్‌ను ప్రాతిపదికగా తీసుకోవడం ఎప్పుడూ జరగని సంఘటన. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి విజేతలుగా ప్రకటించేవారు. ఈసారి అలా జరగకపోవడం భారత జట్టును ఆందోళనకు గురిచేసింది. క్రికెట్ నిబంధనలు స్పష్టంగా ఉండాలని, అధికార దుర్వినియోగం జరగకూడదని భారత వైపు డిమాండ్ చేస్తోంది.

Tags: