Coach Gambhir: తిలక్ వర్మ అడ్డాలో కోచ్ గంభీర్ బర్త్‌డే వేడుకలు.. సిరీస్ పట్టేసి గిఫ్ట్ ఇస్తారా?
సిరీస్ పట్టేసి గిఫ్ట్ ఇస్తారా?
Coach Gambhir: హైదరాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాలుగో టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 45వ పుట్టినరోజు నాడే జరుగుతుండటం. హైదరాబాద్‌లో విండీస్‌ను మట్టికరిపించి సిరీస్ ట్రోఫీతో తమ గురువుకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది.
తిలక్ వర్మ హోమ్ గ్రౌండ్.. పండగ వాతావరణం
ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుండటంతో స్థానిక ఆటగాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మకు ఇది సొంత మైదానం. తిలక్ సొంతగడ్డపై మ్యాచ్ జరగడం, కోచ్ బర్త్‌డే ఒకే రోజు కావడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, ఇక్కడ విజయం సాధిస్తేనే వేడుకలకు అసలైన నిండుదనం వస్తుంది. మరోవైపు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే వెస్టిండీస్‌కు ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్ కావడంతో వారు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఉప్పల్ గడ్డపై టీమిండియా 100% విన్నింగ్ రికార్డ్
హైదరాబాద్ మైదానంలో టీ20ల్లో భారత జట్టుకు అజేయ రికార్డు ఉంది. ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఆడిన 3 టీ20 మ్యాచ్‌లలోనూ విజయం సాధించి 100 శాతం విన్నింగ్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తోంది.హఇందులో ఒక విజయం 2019లో వెస్టిండీస్‌పైనే సాధించింది. విండీస్ జట్టు దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ గడ్డపై టీ20 మ్యాచ్ ఆడుతుండటం గమనార్హం. చివరిసారిగా 2024లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ ఇక్కడ భారీ తేడాతో ఘన విజయం అందుకుంది.
హైదరాబాద్‌లో భారత ఓపెనర్ల విధ్వంసం
ఈ మైదానం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి భారత ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు ఉప్పల్ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఇద్దరు బ్యాటర్లూ టీ20 ఫార్మాట్లో ఇక్కడ చెరో 2 సెంచరీలు నమోదు చేసి రికార్డు సృష్టించారు. గంభీర్ పుట్టినరోజు నాడు ఈ ఓపెనర్లు మరోసారి మెరుపులు మెరిపిస్తే టీమిండియా సిరీస్ గెలవడం నల్లేరుపై నడకే కానుంది.