CSK: ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు వచ్చే సీజన్‌కు ముందు కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించని ఆటగాళ్లలో ఒకరిని జట్టు నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రూ.14.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను వదిలేయాలని సీఎస్‌కే ఆలోచిస్తున్నట్లు సమాచారం.

గత ఏడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ప్రశాంత్ వీర్, వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ కోసం సీఎస్‌కే ఏకంగా రూ.14.2 కోట్లు ఖర్చు చేసింది. అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో వీరిద్దరూ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ప్రశాంత్ వీర్‌ను జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉందని క్రిక్‌బజ్ కథనం వెల్లడించింది.

20 ఏళ్ల ప్రశాంత్ వీర్ దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. 6.81 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో 202 పరుగులు చేసి 150.74 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అయితే, ఐపీఎల్ 2026లో సీఎస్‌కే తరఫున ఆరు ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఆర్సీబీపై చేసిన 43 పరుగులే అత్యధికం. బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Tags: