De Kock’s Destruction: డి కాక్ విధ్వంసం: దక్షిణాఫ్రికా చేతిలో పాక్ చిత్తు!
దక్షిణాఫ్రికా చేతిలో పాక్ చిత్తు!
De Kock’s Destruction: వన్డే ఫార్మాట్‌లోకి తిరిగొచ్చిన తర్వాత, దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, పాకిస్థాన్‌తో జరిగినరెండో వన్డేలో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను సాధించిన శతకం (123 నాటౌట్) ధాటికి పాకిస్థాన్ జట్టు పత్తా లేకుండా పోయింది.డి కాక్ సెంచరీతో చెలరేగడంతో, దక్షిణాఫ్రికా జట్టు పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. సఫారీలు కేవలం రెండు వికెట్లు కోల్పోయి, ఇంకా 59 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో వన్డే సిరీస్ 1-1తో సమమైంది. దక్షిణాఫ్రికా తరఫున వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కి వచ్చిన తర్వాత డి కాక్‌కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. డి కాక్.. తన ఓపెనింగ్ భాగస్వామి ల్రువాన్-డ్రే ప్రిటోరియస్ (46)తో కలిసి జట్టుకు బలమైన పునాది వేశాడు. ఆ తర్వాత టోనీ డి జోర్జీ (76)తో కలిసి మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. సల్మాన్ ఆఘా (69), మహ్మద్ నవాజ్ (59), సయీమ్ అయూబ్ (53) అర్ధ సెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో నాండ్రె బర్గర్ 4 వికెట్లు, న్గాబా పీటర్ 3 వికెట్లు పడగొట్టారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (119 బంతుల్లో 123 నాటౌట్)8 ఫోర్లు, 7 సిక్స్‌లు.. అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. టోనీ డి జోర్జి (63 బంతుల్లో 76) కూడా కీలక పాత్ర పోషించాడు.