Dravid’s Younger Son: అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలోకి ద్రవిడ్ చిన్న కొడుకు
ద్రవిడ్ చిన్న కొడుకు
Dravid’s Younger Son: భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ వారసత్వాన్ని అతని చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. నవంబర్ 5 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్న పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ టోర్నీలో అన్వయ్‌కు చోటు దక్కింది. అన్వయ్ ద్రవిడ్ ఈ టోర్నీలో టీమ్ 'సీ' తరఫున ఆడనున్నాడు. అతను ప్రధానంగా టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. టీమ్ 'సీ'కి ఆరోన్ జార్జ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అన్వయ్ ద్రవిడ్ గతంలో దేశీయ టోర్నీల్లో చూపిన అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికయ్యాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అన్వయ్ అద్భుతంగా రాణించాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే దాదాపు 92 సగటుతో 459 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతనిలో ఉన్న బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ కీపింగ్ సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను జూనియర్ సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. టీమిండియాకు 'ది వాల్'గా సేవలందించిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో భారత అండర్-19, అండర్-21 జట్లకు కోచ్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు అతని చిన్న కుమారుడు జాతీయ స్థాయి టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతుండడంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్. గతంలో అతడు కూడా కర్ణాటక తరఫున జూనియర్ క్రికెట్‌లో ఆడి, అండర్-19 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.