Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్: ఈస్ట్ జోన్ ఆధిపత్యం.. సౌత్ జోన్ విలవిల
సౌత్ జోన్ విలవిల
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ జట్టు అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌తో సునామీ సృష్టించిన ఈస్ట్ జోన్.. మూడో రోజు బౌలింగ్‌లోనూ అదే జోరును కొనసాగించి సౌత్ జోన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది.
ముందుగా తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 334 బంతుల్లోనే అద్భుతమైన 270 పరుగుల భారీ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు! మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో ఈస్ట్ జోన్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే.
ఇక భారీ లక్ష్యంతో మంగళవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ తడబడింది. ఈస్ట్ జోన్ బౌలర్ల దాటికి ఏ ఒక్క బ్యాటరూ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ 62 పరుగులు, కెప్టెన్ తిలక్ వర్మ అజేయంగా 56 పరుగులు చేసి పోరాడినప్పటికీ.. మిగతా వారు విఫలమయ్యారు. నారాయణ్ జగదీశన్ 32, షేక్ రషీద్ 27, శ్రేయస్ గోపాల్ 26 పరుగులు చేయగా.. ఓపెనర్ రికీ భుయ్ కేవలం 1 పరుగుకే వెనుదిరిగాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మతో పాటు చామ మిలింద్ ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో మహ్మద్ షమి, ముకేశ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్, కౌనైన్ ఖురేషీ చెరో వికెట్ పడగొట్టారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. సౌత్ జోన్ ఇంకా 466 పరుగుల భారీ వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ విజయం ఖాయంలా కనిపిస్తోంది!