GST Reforms: జీఎస్టీ సంస్కరణలు.. భారీగా పెరగనున్న ఐపీఎల్ టికెట్ ధరలు
భారీగా పెరగనున్న ఐపీఎల్ టికెట్ ధరలు
GST Reforms: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టి, ఇప్పటివరకు ఉన్న నాలుగు స్లాబ్‌లను రెండుకు కుదించింది. ఇందులో భాగంగా, లగ్జరీ సేవలు, వినోదాలపై పన్నును 28 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచింది. దీంతో ఐపీఎల్ వంటి ప్రీమియం క్రికెట్ టోర్నమెంట్ల టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
టికెట్ ధరలపై ప్రభావం
కొత్త జీఎస్టీ విధానం ప్రకారం.. ఐపీఎల్ టికెట్లపై ఇప్పుడు 40శాతం పన్ను విధించనున్నారు. ఉదాహరణకు గతంలో ఒక ఐపీఎల్ మ్యాచ్ టికెట్ ధర రూ. 1,000 అనుకుంటే, దానిపై 28శాతం జీఎస్టీ (రూ. 280) కలిపి మొత్తం రూ. 1,280 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అదే టికెట్‌పై 40శాతం పన్ను చెల్లించాలి. దీంతో మొత్తం టికెట్ ధర రూ. 1,400కు చేరుకుంటుంది. అంటే ఒక టికెట్‌పై అదనంగా రూ. 120 భారం పడుతుంది. టికెట్ ధర పెరుగుతున్న కొద్దీ ఈ భారం కూడా పెరుగుతుంది.
ఏయే సేవలపై కొత్త పన్ను?
లగ్జరీగా పరిగణించే రేస్ క్లబ్‌లు, లీజింగ్/రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌తో పాటు ప్రీమియం క్రికెట్, ఇతర స్పోర్టివ్ ఈవెంట్ల టికెట్ ధరలు కూడా ఈ 40% పన్ను పరిధిలోకి వస్తాయి.
ప్రీమియం లీగ్‌లకే వర్తింపు
ఈ కొత్త పన్ను విధానం ఐపీఎల్ లేదా ఇతర ప్రీమియం లీగ్‌లకే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో జరిగే క్రీడలకు ఎలాంటి పన్ను పెంపు ఉండదని, వాటిపై పాత పద్ధతిలోనే 18 శాతం పన్ను కొనసాగుతుందని పేర్కొంది. అయితే ఐపీఎల్ టికెట్ల ధరల పెరుగుదల వల్ల ప్రేక్షకుల ఆదరణపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ లేదా ఫ్రాంచైజీలు అభిమానుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.