Gukesh Stuns Sindarov: గుకేశ్ ఎత్తుగడలకు సిందరోవ్‌కు చెక్.. 60 ఎత్తుల తర్వాత మూడో గేమ్ డ్రా
| మూడో గేమ్ డ్రా
Gukesh Stuns Sindarov: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మూడో గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ డి. గుకేశ్ వేసిన ఎత్తులకు తాను ఉక్కిరిబిక్కిరైనట్లు చాలెంజర్ జావోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్థాన్) అంగీకరించాడు. నల్లపావులతో ఆడిన గుకేశ్ ఆరంభంలోనే అత్యుత్తమ సన్నద్ధతతో బరిలోకి దిగి తనపై ఒత్తిడి పెంచాడని పేర్కొన్నాడు. వరుసగా మూడో గేమ్ కూడా డ్రాగా ముగియడంతో ఇరువురు ఆటగాళ్లు 1.5–1.5 పాయింట్లతో సమంగా నిలిచారు.
ఈ మ్యాచ్‌లో తొలిసారిగా గుకేశ్ ఆరంభ ఎత్తులను వేగంగా కదపగా, తెల్లపావులతో ఆడిన సిందరోవ్ ఎక్కువ సమయం ఆలోచిస్తూ గడిపాడు. దాదాపు 15వ ఎత్తు వరకు గుకేశ్‌కు అన్నీ తెలిసినట్లే ఆడాడని, దాంతో సమయ పాలనలో తాను ఇబ్బందిపడ్డానని సిందరోవ్ తెలిపాడు. ఆఖరి ఎత్తుకు కేవలం 7 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉన్నా, సిందరోవ్ అద్భుతంగా రక్షణాత్మక ఆటతీరుతో గేమ్‌ను డ్రా చేసుకోగలిగాడు.
గుకేశ్ బెర్లిన్ డిఫెన్స్‌లో రియో డి జనీరో వేరియేషన్ (5...Be7) ఆడి సిందరోవ్‌ను ఆశ్చర్యపరిచాడు. దీంతో గుకేశ్‌కు సమయంలో పెద్ద ప్రయోజనం లభించింది. 60 ఎత్తుల మారథాన్‌లో ఇద్దరూ విజయం కోసం ప్రయత్నించినా, చివరికి వ్యతిరేక రంగు బిషప్‌ల ఎండ్‌గేమ్‌లో డ్రా అయింది. 14 గేమ్‌ల ఈ సుదీర్ఘ పోరులో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, ఇద్దరం అత్యుత్తమ చెస్ ఆడుతుండటం వల్లే విజయాలు సులభంగా దక్కడం లేదని గుకేశ్ అభిప్రాయపడ్డాడు.
శుక్రవారం తొలి విశ్రాంతి దినం కాగా, శనివారం (నవంబర్ 28) జరిగే నాలుగో గేమ్‌లో గుకేశ్ తెల్లపావులతో ఆడనున్నాడు. సేల్స్‌ఫోర్స్ ఫైడ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ జెనీవాలోని ఫోండేషన్ మార్టిన్ బోడ్మర్‌లో జరుగుతోంది. మ్యాచ్‌లో మొదటి 7.5 పాయింట్లు చేరినవారు ఛాంపియన్ అవుతారు. ప్రైజ్ మనీ 2.5 మిలియన్ డాలర్లు.