2030 Commonwealth Games: చరిత్ర సృష్టించిన భారత్: 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం! వేదిక అహ్మదాబాద్!
2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం! వేదిక అహ్మదాబాద్!
2030 Commonwealth Games: భారతదేశ క్రీడా చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడింది. ప్రతిష్టాత్మకమైన 2030 కామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games - CWG) నిర్వహణ హక్కులను భారతదేశం దక్కించుకుంది. ఈ మెగా క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్య వేదికగా గుజరాత్‌లోని చారిత్రక నగరం అహ్మదాబాద్ ఎంపిక కావడం విశేషం. అహ్మదాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత నరేంద్ర మోదీ స్టేడియం ఉంది, దీని సామర్థ్యం 1.32 లక్షలు. ఈ స్టేడియం వంటి అత్యాధునిక క్రీడా ప్రాంగణాలు, మౌలిక సదుపాయాలు నగరాన్ని ఆతిథ్యానికి బలమైన పోటీదారుగా నిలబెట్టాయి. ఈ ఆతిథ్య హక్కుల కోసం అహ్మదాబాద్, నైజీరియాలోని అబూజా నగరంతో గట్టిగా పోటీపడింది. అన్ని అంశాలను పరిశీలించిన కామన్‌వెల్త్ స్పోర్ట్ బాడీ (CSB), భారత్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులను భారత్ దక్కించుకోవడం ఇది రెండోసారి.2010లో న్యూఢిల్లీ వేదికగా భారత్ తొలిసారిగా కామన్‌వెల్త్ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ నిర్ణయాన్ని నవంబర్ 26న గ్లాస్గోలో జరగనున్న CWG జనరల్ అసెంబ్లీ సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విజయం భారత క్రీడా రంగానికి, గుజరాత్‌కు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చింది. 2030లో జరగబోయే ఈ క్రీడా వేడుకల కోసం అహ్మదాబాద్ నగరం ఇప్పటి నుంచే భారీస్థాయిలో సిద్ధం కానుంది. ఈ మెగా టోర్నీ ద్వారా భారత్ తన క్రీడా సామర్థ్యాన్ని, అతిథేయ నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం లభించింది..